Home Telangana కొడంగల్‌పై సీఎం అభివృద్ధి గురి!

కొడంగల్‌పై సీఎం అభివృద్ధి గురి!

రైతు మేళాతో పర్యటనకు శ్రీకారం.
3 రోజుల టూర్‌లో ₹ 9 వేల కోట్ల వర్క్స్ .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్‌లో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. అనంతరం స్టాళ్లను సందర్శించి మధ్యాహ్నం 3.30 నుంచి ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో, 4.30 నుంచి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. సాయంత్రం విద్యాహబ్ పనులను పరిశీలించి కొడంగల్ నివాసంలో బస చేస్తారు.

విద్య, వైద్యం, మౌలిక వసతులకు ప్రాధాన్యం

నవంబర్ 8న ఉదయం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమైన అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. హకీంపేట, బాలంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌లో జూనియర్ కళాశాలలు, హకీంపేట, కొడంగల్, దుద్యాలలో పోలీస్ స్టేషన్లు, కొడంగల్ సర్కిల్ కార్యాలయం, దుద్యాలలో సమీకృత మండల కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కోస్గిలో సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. నాచారం వద్ద రూ.5,060 కోట్లతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేయనున్నారు.

భారీ రైతు సభతో పర్యటన ముగింపు

నవంబర్ 8న పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం కొడంగల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తం పర్యటనలో సుమారు రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, రహదారులు, పోలీసు వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ పర్యటనతో కొడంగల్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

#RevanthReddy, #Kodangal, #KodangalDevelopment, #TelanganaDevelopment, #FarmersMeet, #IndustrialExpo, #YoungIndiaEducationHub, #EcoPalm, #RadialRoad2, #Vikarabad, #TelanganaNews