Home Telangana భూముల వేలం.. ఆదాయానికి మూలం

భూముల వేలం.. ఆదాయానికి మూలం

ప్రభుత్వ భూములే ప్రధాన వనరులు.
ల్యాండ్ పూలింగ్, వేలంపై భట్టి కార్యాచరణ.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేసి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువుల్లో ఆదాయ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు, పారిశ్రామిక లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయం పెంచే అవకాశాలపై చర్చించారు. ప్రతి శాఖ వారాలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని, పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని భట్టి సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.

పారిశ్రామిక భూములపై ప్రత్యేక దృష్టి

అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట పారిశ్రామిక ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. బీ-కేటగిరీ, సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి వారాలవారీ లక్ష్యాలు పెట్టి, రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ చేపట్టే అవకాశాలపై సమీక్షించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, రహదారులు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులు, భూ యజమానులకు స్పష్టత, ప్రయోజనం కలిగేలా పారదర్శక విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రభుత్వానికి వాటాగా వచ్చే భూములను ప్రజా అవసరాలకు వినియోగించడంతో పాటు అదనపు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల అంశాలను చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిశీలించి మంత్రివర్గానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

భూముల వేలానికి డిజిటల్ నిఘా

హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూముల అభివృద్ధి, వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకునే అవకాశాలను కూడా సమావేశంలో పరిశీలించారు. ప్రధాన రహదారులకు అనుసంధానం ఉన్న, అభివృద్ధికి అనువైన ప్రాంతాల్లో వేలానికి సిద్ధంగా ఉన్న లేఅవుట్లు, ప్లాట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వాటి వివరాలు, ప్రస్తుత స్థితి, ముందస్తు ఏర్పాట్లతో కూడిన కార్యాచరణ ప్రణాళికను వచ్చే వారంలోగా సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, లేఅవుట్లు, వేలం ప్రక్రియల పర్యవేక్షణకు ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డును రూపొందించాలని స్పష్టం చేశారు. భూముల వివరాలు, వేలానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు, పనుల పురోగతి మొత్తం ఒకే వేదికపై అందుబాటులో ఉండాలి అని పేర్కొన్నారు. దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల విలువ పెంచడం, వనరులను సమర్థంగా వినియోగించడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

#BhattiVikramarka #TelanganaGovernment #LandAuctions #LandPooling #GovernmentLands #TelanganaRevenue #HMDA #TGIIC #HyderabadRealEstate #Medchal #Rangareddy #TelanganaNews