ఓటర్ల జాబితా ప్రక్షాళనతో కలకలం
12న లిస్టును స్తంభింపజేసిన ఈసీ
ఓటర్ల జాబితా ప్రక్షాళనపై రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ఎన్నికల సంఘం ప్రత్యేక ఓట్ల వడపోత, సర్-2026 పేరుతో ఓటర్ల వివరాలను ఆధునిక సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తుండగా, మరోవైపు ఈ ప్రక్రియ కాంట్రవర్శీలకు దారితీస్తోంది. రాష్ట్రంలోని 3.38 కోట్ల ఓటర్లలో ఏకంగా 89.55 లక్షల మందికి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించడంతో వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన ఆధారాలు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో ఈ సవరణ పేరుతో ముస్లింల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని మంత్రి అజారుద్దీన్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో మరింత సంచలనంగా మారింది. దీంతో సర్ ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ వేడెక్కుతోంది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ, ప్రత్యేక ఓట్ల వడపోత (సర్)–2026 ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. జాబితాను స్తంభింపజేయడం వల్ల కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. చివరిసారిగా 2002 సంవత్సరంలో ఇటువంటి సవరణ కార్యక్రమం జరిగింది. నాటి జాబితాలోని వివరాలతో ప్రస్తుత ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం మ్యాపింగ్ చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది.
భారీగా లీకైన అనుమానాస్పద ఓటర్లు
ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా మ్యాపింగ్ చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి. మ్యాపింగ్ పూర్తయిన వారిలో ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల వివరాలలో వ్యత్యాసాలు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ గుర్తించింది. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, బంధుత్వం వంటి వివరాలలో తప్పులు దొర్లాయి. తండ్రి, బిడ్డ వయసు మధ్య తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం వంటి అనేక లోపాలను సాఫ్ట్‌వేర్ ట్రేస్ చేసింది. నిజామాబాద్ జిల్లాలో 5 లక్షలకు పైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 8.38 లక్షల మంది వివరాలలో తప్పులు ఉన్నట్లు తేలింది.
లక్షలాది మందికి ఈసీ నోటీసులు
ఈ వ్యత్యాసాల నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో సుమారు 26.47 శాతం మందికి నోటీసులు జారీ కానున్నాయి. జూలై 31 నుండి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నారు. తమ వివరాలను నిరూపించుకోవడానికి ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు చూపించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతకంటే ముందే ఈ నెల 25 నుండి వచ్చే నెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి రెండు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారు.
కొత్త ఓటర్లకు దరఖాస్తు అవకాశం
ఓటర్ల జాబితాను స్తంభింపజేసినప్పటికీ అంతర్గతంగా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాతే తప్పులున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు లేని 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బూత్ స్థాయి అధికారులు ఫారం–6తో పాటు ఒక స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుండి ఆగస్టు 30 మధ్య ఈ కొత్త దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తారు.











