Home Telangana దానం అర్హతపై హైకోర్టు తీర్పు శుక్రవారం

దానం అర్హతపై హైకోర్టు తీర్పు శుక్రవారం

నాగేందర్‌ వ్యవహారంపై పొలిటికల్ రచ్చ .

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై హైకోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, అనంతరం కాంగ్రెస్ బీ-ఫారంతో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారించింది. దానం అనర్హతపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు.

బీ-ఫారంతో పోటీ కీలకమన్న పిటిషనర్లు

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీ-ఫారంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుకు స్పష్టమైన ఆధారమని వాదించారు. పార్టీ మార్పును నిర్ణయించేందుకు అసెంబ్లీలో ఎమ్మెల్యే వ్యవహారాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్న స్పీకర్ వైఖరిని వారు వ్యతిరేకించారు. స్పీకర్ నిర్ణయం న్యాయపరిశీలనకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. దానం తరఫు న్యాయవాది ఈ వాదనలను ఖండించారు. దానం బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్లు ప్రకటించలేదని తెలిపారు. అసెంబ్లీ రికార్డుల్లో దానం ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారని కోర్టుకు వివరించారు. వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు వెలువడాల్సిన తీర్పును ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.

#DanamNagender #DanamNagenderCase #TelanganaHighCourt #DanamDisqualification #KhairatabadMLA #PadiKaushikReddy #AlletiMaheshwarReddy #BRS #Congress #AntiDefectionLaw #TelanganaAssembly #MLADisqualification #DefectionCase #TelanganaPolitics #HighCourtVerdict