బిహార్‌లో పరీక్షా విధానంలో అవకతవకలు, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. సెప్టెంబర్ 3న ఢిల్లీలో బిహార్‌కు చెందిన విద్యార్థులను కలిసిన రాహుల్.. వారు ఎదుర్కొన్న పోలీసుల చర్యను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం సమ్రాట్ చౌధరిని ప్రశ్నించారు. “వారి విరిగిన ఎముకలు మానిపోతాయి.. కానీ వారి పగిలిపోయిన కలలను మీరు తిరిగి ఇవ్వగలరా?” అని నిలదీశారు. విద్యార్థులు అడిగింది కేవలం విద్య, ఉపాధి, జవాబుదారీతనం మాత్రమేనని అన్నారు. తన వద్దకు వచ్చిన విద్యార్థుల్లో ఒకరి కాలికి ఏకే-47 బుల్లెట్ తగిలి ఎముక విరిగిందని, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న అతని కల దెబ్బతిందని రాహుల్ పేర్కొన్నారు. మరో ఇద్దరు విద్యార్థుల భుజాలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. గాయాలు మానినా.. పిల్లల్లో ఏర్పడిన భయానికి చికిత్స ఎక్కడుందని ప్రశ్నించారు.
పేద కుటుంబాల కలలకు దెబ్బ
విద్యార్థులు నేరస్తులు కాదని, పేద కుటుంబాల నుంచి వచ్చి చదువు, ఉద్యోగం ద్వారా తమ జీవితాలను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న యువత అని రాహుల్ అన్నారు. పారదర్శక పరీక్షా విధానం, సమాన అవకాశాలు, తమ హక్కుల కోసం వారు ఆందోళన చేశారని చెప్పారు. అలాంటి డిమాండ్లకు లాఠీలు, తుపాకీ కాల్పులు ఎందుకు అవసరమయ్యాయని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు కేవలం కొందరు దిగువస్థాయి అధికారులను బాధ్యులను చేసి ప్రభుత్వం తప్పించుకోలేదని, ఇది పైస్థాయి ఆదేశాల ఫలితమా.. లేక పరిపాలనా వైఫల్యమా అనేది తేలాల్సి ఉందని అన్నారు. యువత గొంతును అణచివేసే ఏ ప్రభుత్వమైనా చివరకు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని రాహుల్ హెచ్చరించారు. బిహార్‌లో ఆగస్టు మొదటి వారం నుంచి విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాట్నాలో ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యోగార్థులను పోలీసులు అడ్డుకున్నారు. సింగిల్-టైర్ ఉపాధ్యాయ పరీక్ష, పారదర్శక నియామక ప్రక్రియ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రతిపక్ష నేతలు, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వీ యాదవ్ మద్దతు తెలిపారు.
#RahulGandhi #BiharStudentProtest #BiharStudents #StudentProtest #BiharPolice #PoliceFiring #BiharPolitics #PMModi #NarendraModi #SamratChoudhary #BiharGovernment #ExamIrregularities #TeacherRecruitment #JobRecruitment #TejashwiYadav #RJD #StudentRights #TransparentExams











