35 ప్రత్యేక విమానాలు.. కట్టుదిట్టమైన సమన్వయం.
వీవీఐపీ విమానాల రాకతో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దాదాపు 35 ప్రత్యేక విమానాలను నిర్వహించేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పాలం టెక్నికల్ ఏరియా, ఇతర విమానాశ్రయాలను సమన్వయం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా వీవీఐపీ కదలికలను ప్రత్యేక మార్గాల్లో నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థాయి నేతలకు పాలం టెక్నికల్ ఏరియా ద్వారా టెర్మినల్‌కు దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రత్యేక సెరిమోనియల్ సదుపాయాలు వినియోగిస్తున్నారు. విమానం దిగిన తర్వాత నేతలు ఏ మార్గం నుంచి బయటకు వస్తారన్నది చివరి దశలో నిర్ణయించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు.
గగనతలంలో ప్రతి నిమిషం కీలకమే
బ్రిక్స్ నేతల రాకపోకల కారణంగా ఢిల్లీ చుట్టూ గగనతల నియంత్రణ మరింత కట్టుదిట్టమైంది. సాధారణంగా వీవీఐపీ విమానం కోసం కొన్ని నిమిషాల పాటు ప్రత్యేక ఎయిర్‌స్పేస్ కేటాయిస్తారు. సదస్సు సమయంలో వరుసగా ప్రత్యేక విమానాలు రావడంతో ఈ సమయాలను ముందుగానే సమన్వయం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో నాన్-షెడ్యూల్డ్ విమానాలపై ఆంక్షలు విధించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు మినహాయింపు ఉన్నా, వాటి టైమింగ్స్‌ను అవసరాన్ని బట్టి 10–15 నిమిషాల వరకు సర్దుబాటు చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేక విమానంతో సమయాలు ఢీకొంటే కమర్షియల్ విమానాన్ని గాల్లో కొద్దిసేపు వేచి ఉంచడం, పరిస్థితిని బట్టి మరో విమానాశ్రయానికి మళ్లించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
విమానాల పార్కింగ్‌కు బహుళ విమానాశ్రయాలు
ప్రత్యేక విమానాల పార్కింగ్ కూడా భారీ ఆపరేషన్‌గా మారింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్, పాలంతో పాటు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సఫ్దర్‌జంగ్, హిండన్ సహా మరో రెండు విమానాశ్రయాలను పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు 70–75 శాతం దేశాలు ఒక్కో ప్రత్యేక విమానంతో వచ్చే అవకాశం ఉండగా, 10–15 శాతం దేశాలు రెండు విమానాలు తీసుకురావచ్చని అంచనా. మరో 10–15 శాతం ప్రతినిధులు షెడ్యూల్డ్ విమానాల్లో వచ్చే అవకాశం ఉంది. నేలపై కూడా భద్రతా తనిఖీలు కఠినంగా ఉంటాయి. విమానాలకు అందించే ఇంధనం నుంచి రెండు నమూనాలను పరీక్షించడం వంటి అదనపు చర్యలు చేపడుతున్నారు. సీఐఎస్ఎఫ్, వాయుసేన, విమానయాన అధికారులు, భద్రతా సంస్థలు కలిసి ప్రతి విమానం రాక, పార్కింగ్, బయలుదేరే సమయాన్ని ఖచ్చితంగా సమన్వయం చేస్తున్నాయి. మొత్తంగా వీవీఐపీ కదలికలకు ప్రత్యేక భద్రత.. కమర్షియల్ విమానాలకు నిరంతర సేవలు కొనసాగించేలా ఢిల్లీ ఆకాశంలో భారీ స్థాయి సమన్వయ ఆపరేషన్ సాగుతోంది.
#BRICS #BRICSSummit2026 #BRICSSummit #Delhi #DelhiAirport #BRICSFlights #SpecialFlights #VVIPFlights #DelhiAirspace #AirspaceRestrictions #BRICSSecurity #DelhiAirportSecurity #PalamTechnicalArea #NoidaInternationalAirport #SafdarjungAirport #HindonAirport #CISF #IndianAirForce #VVIPMovement #AviationNews #DelhiNews











