రషీద్ అల్వీ వ్యాఖ్యలపై సుధాంశు త్రివేది ఫైర్ .
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించడంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ఏదైనా “దాగిన నిజం” ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులకు గవర్నర్ పదవులు, రాజ్యసభ అవకాశాలు కల్పించడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోందని వ్యాఖ్యానించిన అల్వీ.. రిటైర్డ్ ఎయిర్ చీఫ్‌ను రామమందిర ట్రస్ట్ సీఈవోగా నియమించడంపై కూడా ప్రశ్నలు సంధించారు. దీనిపై బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తీవ్రంగా స్పందించారు. రషీద్ అల్వీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు భారత సైన్యం, శ్రీరామమందిరంపై ఉన్న వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గతంలో రాముడి ఉనికినే ప్రశ్నించారని, అయోధ్యను అవమానించారని విమర్శించారు.
సైన్యంపై కాంగ్రెస్ వైఖరేంటంటూ దాడి
సుధాంశు త్రివేది మరింత ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు గతంలో సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ దాడులకు ఆధారాలు అడిగారని గుర్తుచేశారు. భారత సైన్యాధిపతిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన నేతలు కూడా కాంగ్రెస్‌లో ఉన్నారని ఆరోపించారు. పాకిస్థాన్ సైన్యాధిపతి ఖమర్ జావేద్ బజ్వాను కాంగ్రెస్ నేత నవజోత్‌సింగ్ సిద్ధూ ఆలింగనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్థాన్ ప్రధాని, అధ్యక్షుడు చేసిన ప్రకటనల తర్వాత కూడా అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇలాంటి వైఖరి “దిమాగీ నక్సల్” ఆలోచనా ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మహ్మద్ ఘజనీ, ఘోరీ, బాబర్ ఆలయాలను కేవలం దోచుకోవడానికి మాత్రమే రాలేదని, వాటిని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టడమే వారి లక్ష్యమని త్రివేది అన్నారు. మొత్తంగా రామమందిర ట్రస్ట్ నియామకంపై రషీద్ అల్వీ చేసిన ప్రశ్నలు బీజేపీ–కాంగ్రెస్ మధ్య మరోసారి సైన్యం, అయోధ్య, రామమందిరం అంశాలపై రాజకీయ మాటల యుద్ధానికి దారితీశాయి.
#RamMandir #RashidAlvi #SudhanshuTrivedi #BJP #Congress #Ayodhya #RamJanmabhoomi #RamMandirTrust #JitendraMishra #OperationSindoor #IndianArmy #BJPvsCongress #AyodhyaPolitics #PoliticalWar #IndiaPolitics











