Home National_news గ్యాస్ సిలిండర్‌కు బైబై పైప్ గ్యాస్‌పై కేంద్రం ఫోకస్! ఎల్పీజీకి ప్రత్యామ్నాయం

గ్యాస్ సిలిండర్‌కు బైబై పైప్ గ్యాస్‌పై కేంద్రం ఫోకస్! ఎల్పీజీకి ప్రత్యామ్నాయం

ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే చాలు.. వంట మొదలుపెట్టే ముందు గ్యాస్ ఉందా? లీక్ అవుతుందా? సిలిండర్ ఎప్పుడు వస్తుందా? అనే టెన్షన్‌కు కొదవే ఉండదు. ఇప్పుడు ఈ కష్టాలన్నింటికీ ‘బైబై’ చెప్పే సమయం వచ్చిందంటోంది కేంద్రం. సిలిండర్‌ను మోసుకొచ్చే రోజులు పోయి.. పైపు నుంచే గ్యాస్ ఇంట్లోకి వచ్చే రోజులు రానున్నాయి. భద్రత, నిరంతర సరఫరా, సౌకర్యం పేరుతో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పీఎన్జీని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే సిలిండర్‌కు వీడ్కోలు చెప్పడం అంత ఈజీ కాదనే మాట కూడా వినిపిస్తోంది. పైపు గ్యాస్ వస్తే వంటగదిలో టెన్షన్ తగ్గుతుందా? లేక కొత్త పైపు సమస్యలు మొదలవుతాయా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తానికి భద్రత పేరుతో వంటింట్లో మరో పెద్ద మార్పుకు తెరలేస్తోంది.

వంటగ్యాస్ వినియోగంలో కీలక మార్పు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్పీజీ నుంచి పైపుల ద్వారా వచ్చే సహజవాయువు, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) వైపు ఇళ్లను మళ్లించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. పీఎన్జీ ను సురక్షితమైన, పరిశుభ్రమైన, సమర్థవంతమైన వంట ఇంధనంగా కేంద్రం పేర్కొంది. ఈ మార్పుతో ఎల్పీజీ సిలిండర్ల రవాణా, నిల్వపై భారం తగ్గడంతో పాటు వినియోగదారులకు సౌకర్యం పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థకు ఎదురైన అంతరాయాల నేపథ్యంలో పీన్జీ విస్తరణకు ప్రాధాన్యం పెరిగింది.

ప్రతి జిల్లాలో నోడల్ అధికారి

ఆగస్టు 21న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన లేఖలో పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని కోరారు. జిల్లా స్థాయిలో నియమించే అధికారి హోదా జిల్లా సరఫరా అధికారి స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని సూచించారు. ఈ అధికారి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేస్తారు. ఇళ్లకు పీఎన్జీ కనెక్షన్లు అందించే ప్రక్రియలో హౌసింగ్ సొసైటీలు, ఆర్‌డబ్ల్యూఏల నుంచి అవసరమైన అనుమతులు, వినియోగదారుల సమస్యలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి పీఎన్జీ సంస్థలకు మార్పు వంటి అంశాలను పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం సహకరించనుంది.

ఎల్పీజీ, పీఎన్జీ రెండూ ఉండవు

పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఒకే ఇంటికి ఎల్పీజీ, పీఎన్జీ రెండు కనెక్షన్లు కొనసాగించకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది కేంద్రం. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా పీఎన్జీకు మారేందుకు దరఖాస్తు చేయని కుటుంబాల ఎల్పీజీ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉంది. ప్రతి భౌగోళిక ప్రాంతంలో పీఎన్జీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సిటీ గ్యాస్ సంస్థలు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను ఆదేశించారు. ఈ కమిటీలు అర్హమైన ఇళ్లను గుర్తించడం, అవగాహన శిబిరాలు నిర్వహించడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడతాయి. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో దేశీయ పీఎన్జీ సరఫరా ఎల్పీజీతో పోలిస్తే మరింత స్థిరంగా కొనసాగడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దిగుమతి ఆధారిత ఎల్పీజీపై ఆధారాన్ని తగ్గించి, దేశ ఇంధన భద్రతను పెంచడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

 

#LPG #PNGas #PipedNaturalGas #GasCylinder #LPGAlternative #CentralGovernment #PetroleumMinistry #PNGConnection #CookingGas #EnergySecurity #CityGasDistribution #LPGToPNG #IndiaEnergy #HouseholdGas #FuelPolicy