ఏఐ వేగానికి ఇక బ్రేక్ పడనుందా? నిన్నటి వరకు ప్రపంచాన్ని మార్చేస్తామని పోటీపడిన టెక్ దిగ్గజాలే ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి చూసుకుంటున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడియా హెచ్చరికతో మొదలైన చర్చకు ఓపెన్ఏఐ సామ్ ఆల్ట్మన్, ఎలాన్ మస్క్ మద్దతు పలకడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వేగం తగ్గితే మానవాళికి నష్టం.. వేగం పెంచితే నియంత్రణ తప్పే ప్రమాదం! అసలు ఏఐ ఎక్కడికి దూసుకెళ్తోంది? పరీక్షల సమయంలో ఏఐ ఏజెంట్లు పరిమితులను దాటి ఇంటర్నెట్లోకి చొరబడిన ఘటనలు ఎందుకు కలవరపెడుతున్నాయి? మరో 6 నుంచి 12 నెలల్లోనే ఏఐ ఏజెంట్లు మొత్తం ఇంటర్నెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరవచ్చన్న హెచ్చరిక ఎంత తీవ్రం? మానవ మేధకు మించిన యంత్ర మేధ దిశగా ప్రపంచం పరుగులు తీస్తున్న వేళ.. భద్రతా ప్రమాణాలు ఎవరు నిర్ణయించాలి? ప్రభుత్వాల పాత్ర ఏంటి? టెక్ దిగ్గజాలే వేగం తగ్గించాలని ఎందుకు చెబుతున్నాయి? ఏఐ విప్లవం వెనుక దాగున్న ప్రమాద సంకేతాల అసలు కథ ఇదే!
కృత్రిమ మేధ రంగంలో దూసుకెళ్తున్న దిగ్గజాలు ఒక్కసారిగా ఒకే మాట చెప్పడం టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఏఐ అభివృద్ధి వేగాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడియా చేసిన హెచ్చరికకు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. “డారియో చెప్పింది నిజమే” అంటూ మస్క్ స్పందించగా.. “నేను డారియోతో ఏకీభవిస్తున్నాను” అని ఆల్ట్మన్ పేర్కొన్నారు. అమోడియా తన బ్లాగ్లో.. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త అవసరమని చెప్పారు. అభివృద్ధిని పూర్తిగా ఆపడం వల్ల మానవాళికి ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని, అదే సమయంలో వేగాన్ని అదుపు లేకుండా పెంచడం కూడా ప్రమాదకరమని వివరించారు.
ఇంటర్నెట్ స్వాధీనం చేసుకునే స్థాయికి?
ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలపై అమోడియా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి. పరీక్షల సమయంలో కొన్ని ఏఐ మోడళ్లు తమ పరిమిత వాతావరణం నుంచి బయటకు వచ్చి ఇంటర్నెట్కు అనుసంధానమై, కోడ్ నిల్వ, భాగస్వామ్యానికి ఉపయోగించే హగ్గింగ్ ఫేస్ వంటి వేదికలోకి చొరబడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ఘటనను సాధారణంగా తీసుకోరాదని హెచ్చరించారు. ప్రస్తుత ఏఐ సామర్థ్యాల వృద్ధి ఇదే వేగంతో కొనసాగితే 6–12 నెలల్లో ఏఐ ఏజెంట్ల సమూహం మొత్తం ఇంటర్నెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భారీ ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు.
సేఫ్టీ చెక్స్కు దిగ్గజాల అంగీకారం
ప్రమాదాలను అంచనా వేసేందుకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఎవాల్యుయేటర్లకు కంపెనీలు ఉద్యోగుల తరహా ప్రాప్యత కల్పించాలని అమోడియా సూచించారు. ఇతర ఏఐ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. ఆల్ట్మన్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ ఓపెన్ఏఐ కూడా ఇలాంటి స్వతంత్ర భద్రతా పరిశీలనకు సిద్ధమని వెల్లడించారు. ఏఐ సంస్థలు కలిసి సాధారణ భద్రతా ప్రమాణాలు రూపొందించాలని అమోడియా సూచించారు. ప్రభుత్వాల సహకారం కూడా అవసరమని చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అధునాతన ఏఐ మోడళ్ల విడుదలకు ముందు స్వచ్ఛంద భద్రతా సమీక్ష విధానాన్ని తీసుకొచ్చినా.. దాని అమలు, ప్రభావంపై స్పష్టత లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏఐ భవిష్యత్తు కోసం వేగం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సందేశం ఇప్పుడు టెక్ దిగ్గజాల నుంచి బలంగా వినిపిస్తోంది
#AI #ArtificialIntelligence #AISafety #AIDevelopment #AIRegulation #AIRisk #AIWarning #DarioAmodei #Anthropic #SamAltman #OpenAI #ElonMusk #xAI #AIAgents #AIInternetRisks #AISafetyChecks #AIGovernance #TechGiants #AIIndustry #FutureOfAI #TechNews










