ఘట్కేసర్–కాజీపేటకు నాలుగో లైన్.
తెలుగు రాష్ట్రాలకు భారీగా మల్టీట్రాక్.
రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ చేపట్టనున్నారు. తెలంగాణలో ఘట్కేసర్–కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల నాలుగో లైన్‌కు రూ.2,419 కోట్లతో గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పరిధిలో మొత్తం ఐదు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వైట్‌ఫీల్డ్–బంగారుపేట మధ్య 47 కిలోమీటర్లు, సేలం–కరూర్–దుండిగల్ మధ్య 159 కిలోమీటర్లు, హోసూర్–ఒమలూరు మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు కూడా అనుమతి ఇచ్చారు. 2029–30 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
రైళ్ల వేగం.. సరుకు రవాణాకు ఊపు
కొత్త రైల్వే లైన్లతో రద్దీ మార్గాల్లో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా వేగం కూడా మెరుగుపడనుంది. 4,790 గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందనున్నాయని కేంద్రం తెలిపింది. బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు వంటి కీలక సరుకుల రవాణా సులభం కానుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా అదనంగా సుమారు 47 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. పర్యాటక, పుణ్యక్షేత్రాలకు రైలు కనెక్టివిటీ కూడా మెరుగుపడనుంది. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రాజెక్టులను రూపొందించారు. రైల్వే నెట్వర్క్ విస్తరణతో చమురు దిగుమతులు తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. దాదాపు 12 కోట్ల లీటర్ల చమురు దిగుమతి ఆదా, 62 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా బుల్లెట్ రైలు పనులు కూడా వేగంగా సాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది పరీక్షలు పూర్తయ్యాక 2027లో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
#IndianRailways #RailwayProjects #RailwayExpansion #Ghatkesar #Kazipet #GhatkesarKazipet #FourthRailwayLine #TelanganaRailways #AndhraPradeshRailways #Arakkonam #Renigunta #Multitracking #RailwayInfrastructure #PMGatiShakti #RailwayConnectivity #FreightTransport #PassengerTrains #AshwiniVaishnaw #BulletTrain #Telangana #AndhraPradesh #RailwayNews #IndiaNews











