ఉద్యోగుల నిరసనపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.
అనుమతి నిరాకరణ అప్రజాస్వామికం.
ఈ నెల 10న ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను భయపెట్టి తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించవని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మూడు సంవత్సరాలుగా సమస్యలను పెండింగ్‌లో ఉంచడం సరికాదని ప్రశ్నించారు. ఇప్పుడు మరో రెండేళ్లు ఏమీ అడగొద్దని చెప్పడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అవకాశం కల్పించామని గుర్తుచేశారు. ఇప్పుడు ఉద్యోగుల శాంతియుత కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పీఆర్సీ, ఓపీఎస్ హామీలు ఎక్కడ?
ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు చేసి ఆరు నెలల్లో ఓపీఎస్ తీసుకువస్తామని, పీఆర్సీ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఆ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పోలీసు శాఖలో డీఏలు, టీఏలు, ట్రావెలింగ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ వంటి బకాయిలు ఉన్నాయని తెలిపారు. హోంగార్డుల సమస్యలు కూడా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెబుతూ, 42 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రారంభించి మొత్తం 75 శాతం ఫిట్‌మెంట్ వరకు అందించిన ఘనత గత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
#ChaloHyderabad #TelanganaEmployees #EmployeesProtest #SrinivasGoud #VSrinivasGoud #TelanganaEmployeeUnions #EmployeeDemands #TelanganaGovernmentEmployees #PRC #TelanganaPRC #OPS #OldPensionScheme #CPS #CPSAbolition #DAArrears #TAArrears #RiskAllowance #HomeGuards #ASHAWorkers #BRS #CongressGovernment #HyderabadProtest #TelanganaPolitics #TelanganaNews











