రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సెప్టెంబర్ 30న విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌లో ఉదయం 11 గంటలకు జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, ప్రస్తుత రాజకీయాల్లో తెరవెనుక పొత్తులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయని తాను చెబుతున్న మత మార్పిడులు వంటి అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాలపై తన వద్ద ఉన్న వివరాలను ప్రజల ముందుంచుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే విజయవాడ, అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రజల ముందు 10 ప్రతిపాదనలు ఉంచానని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు విశాఖ వేదికగా మరో ఐదు ప్రతిపాదనలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మూడో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ విధి విధానాలను వివరిస్తానని చెప్పారు.











