Home Telangana అసెంబ్లీ గేటు ఘటన మహిళా పోలీసుల ఫిర్యాదు

అసెంబ్లీ గేటు ఘటన మహిళా పోలీసుల ఫిర్యాదు

కేటీఆర్‌, హరీశ్‌‌తో సహా పలువురిపై కేసులు.

అసెంబ్లీ గేట్ నంబర్‌ 3 వద్ద జరిగిన ఉద్రిక్తతపై సైఫాబాద్ పోలీసులు బీఆర్ఎస్‌ నేతలపై కేసు నమోదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడటం, బెదిరించడం వంటి ఆరోపణలపై కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ విధులను అడ్డుకున్నారని, మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఎదుట టీషర్టులు విప్పి అర్ధనగ్నంగా నిలబడ్డారని, నెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని మహిళా సిబ్బంది ఆరోపించారు. ఘటనతో తమకు మానసిక వేదన, అవమానం కలిగిందని తెలిపారు. ఘటన అనంతరం కొందరు మహిళా పోలీసులకు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు ఫిర్యాదులో వివరించారు. సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, వైద్య రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

నల్ల టీషర్టులతో మొదలైన వివాదం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ఉన్న నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీషర్టులపై ఉన్న నినాదాలకు అనుమతి లేదని, స్పీకర్‌ ఆదేశాల మేరకు లోపలికి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. దీంతో హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అక్కడే టీషర్టులు తొలగించి బనియన్లతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్‌ నేతలకు మధ్య తోపులాట జరిగింది. మహిళా పోలీసులకు తీవ్ర అసౌకర్యం కలిగేలా పరిస్థితి మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. మహిళా పోలీసులపై జరిగిన అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క ప్రకటించిన నేపథ్యంలో తాజాగా కేసులు నమోదయ్యాయి. దీంతో అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన రాజకీయ వివాదంతో పాటు పోలీసు కేసుల వరకు వెళ్లింది.

 

#TelanganaAssembly #AssemblyGate #AssemblyGateCase #KTR #HarishRao #BRS #BRSLeaders #WomenPolice #WomenPoliceComplaint #SaifabadPolice #SudheerReddy #NaveenReddy #BRSProtest #BlackTShirtProtest #AssemblyGateIncident #PoliceCase #TelanganaPolice #KTRCase #HarishRaoCase #AssemblyControversy #TelanganaPolitics #TelanganaNews