నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారని సెటైర్లు విసిరారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో రేవంత్, కేటీఆర్ ఇద్దరూ సమాన బాధ్యత వహించారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్థిక సంక్షోభంతో వందలాది కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థ నిర్వీర్యమైందని, కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుల ద్వారా ఒక కుటుంబం అపార సంపద కూడబెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు జెన్ జెడ్‌కు మద్దతు పేరుతో రేవంత్, కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మారిందని అర్వింద్ అన్నారు. 13 ఏళ్లుగా ఉద్యోగాల క్యాలెండర్‌ను సక్రమంగా అమలు చేయలేకపోయిన రేవంత్, కేటీఆర్‌కు అవార్డులు ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శక పాలన అవసరమని, అందుకే రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.
#DharmapuriArvind #TelanganaPolitics #RevanthReddy #KTR #BRS #BJP #TelanganaStudents #FeeReimbursement #Unemployment #TelanganaNews #Kaleshwaram #MissionBhagiratha #PoliticalNews #BJPTelangana #TeluguNews











