పార్ట్ 1:
రివర్స్‌లో బండి.. కాంగ్రెస్‌కి గండి
నియంతకు పగ్గాలు.. కార్యకర్తలు గగ్గోలు
కూకట్‌పల్లిలో కాక.. కేడర్ నిరసన కేక
సర్వేలో సంచలన విషయాలు.. విస్తుపోయే నిజాలు
కూకట్‌పల్లి కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వేల కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తూ, కనీసం కార్యకర్తకు మంచినీళ్లు కూడా ఇవ్వని ఒక పిసినారి నాయకత్వ అహంకారంతో… నియోజకవర్గంలో పార్టీ పునాదులు కదిలిపోతున్నాయని సొంత పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు. సొంత క్యాడర్‌ను తొక్కిపెడుతూ, కొత్త రక్తాన్ని అణచివేస్తున్న సదరు ‘సేనాపతి’ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాలను సైతం షేక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా లేదా అంటే డౌట్ అంటున్నారు పార్టీ ముఖ్యనేతలు. సీఎంతో ఉన్న క్లోజ్ రిలేషన్స్‌తో నియోజకవర్గాన్ని పణంగా పెడుతున్నారని అటు డివిజన్ స్థాయి నేతలతోపాటు, సీనియర్లు హైరానాపడుతున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటుంటే.. కూకట్‍పల్లిలో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదన్నది నిపుణుల మాట. ఇది కేవలం రాజకీయ అసంతృప్తి కాదని… ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరు గడించిన నియోజకవర్గంలో కాంగ్రెస్ విలాపమంటున్నారు పార్టీ కార్యకర్తలు, నాయకులు. తాజాగా నిర్వహించిన సర్వేలో వచ్చిన విషయాలు అటు పార్టీ నేతలు, కార్యకర్తల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.
నాయకత్వ సంక్షోభంతో విలవిల
కూకట్‌పల్లి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడ వేల కోట్ల రూపాయల ఆర్థికలావాదేవీలు జరుగుతుంటాయి. లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపించగల శక్తి ఈ ప్రాంతానికి ఉంది. ఇక్కడ ఏ చిన్న రాజకీయ మార్పు జరిగినా అది మొత్తం రాష్ట్రంపై ప్రభావం చూపుతుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ బలపడాలని తద్వారా పార్టీ జనం నోళ్లలో నానాలని ఎవరైనా భావిస్తారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అక్కడ పార్టీ ఎదుగుదల పూర్తిగా ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్గత విభేదాలు కలకలం రేపుతున్నాయి. పార్టీని నడిపించే నాయకుడి తీరుతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు నేతలు. సాధారణ కార్యకర్తలు ఈ గందరగోళాన్ని చూసి నిరాశకు గురవుతున్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడే వారికి స్థానిక నాయకత్వ శైలి పెద్ద శాపంగా మారిందన్న భావన ఉంది. నియోజకవర్గాన్ని పూర్తిగా శాసించాల్సిన నాయకుడే.. ఆ పని చేయడం లేదా.. అన్న విమర్శలు జోరందుకున్నాయి. ఎన్నికలు అయ్యాక అంత యాక్టివ్‌గా లేరని… త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలను.. అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి ద్వారా పార్టీకి మైలేజ్ తేవాల్సింది పోయి.. వాటిని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గ ఇంచార్జి హోదాలో ఉండి కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై నిరనసలు ప్రతిధ్వనిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో గాలికి వదిలేసి తన సొంత పనుల్లో బిజీగా గడుపుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.

బండి రమేశ్ ఒంటెద్దు పోకడలు
నియోజకవర్గంలో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదన్నది నాయకుల మాట. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి రమేశ్ పూర్తిగా విఫలమయ్యారని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నట్లు దయనీయ స్థితి నెలకొందంటున్నారు. కనీసం డివిజన్ల వారీగా సమీక్షలు జరిపే తీరిక కూడా ఆయనకు లేదని… నాయకుడే… కదలకపోవడంతో స్థానిక క్యాడర్ కూడా ఇళ్లకే పరిమితమైందన్న భావన ఉంది. పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలు నిరాశతో వెనక్కి తగ్గుతున్నారని… తాము పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి రమేశ్ తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బతికించే కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల వారు పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారట. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందన్నది వారి అభిప్రాయం. నాయకుడి ఒంటెద్దు పోకడలతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం ఆయనకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందా అన్న ప్రశ్నలు వారు వ్యక్తం చేస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యతను ఆయన పూర్తిగా విస్మరించారంటున్నారు. ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీ శ్రేణులకు పెద్ద ఇబ్బందిగా మారాయన్న వాదన వారిది.
సీనియర్లను నిర్లక్ష్యం చేయడమే అసలు సమస్య
పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయాలకే బండి రమేశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తన సొంత వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ మిగిలిన వారిని పక్కన పెడుతున్నారన్నది నియోజకవర్గంలో బలంగా విన్పించే టాక్. దీనివల్ల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని.. పార్టీ కోసం నిలబడే వారి కంటే తన చుట్టూ తిరిగే భజన బృందానికే ఆయన పదవులు ఇస్తున్నారనే అసంతృప్తిని కూకట్‌పల్లి కేంద్రంగా పార్టీ కోసం పనిచేస్తున్న కొందరు నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలకు ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదని… వారిని కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటున్నారు. సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోకుండా వారిని అవమానిస్తున్నారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. ఈ నిర్లక్ష్యం వల్ల సీనియర్లు యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారట. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా బలహీనపరుస్తోందట. నాయకత్వం అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి బదులు విభజన రాజకీయాలకు తెరలేపిందన్నది ఇప్పుడు అక్కడ విన్పిస్తూన్న మాట. కార్యకర్తల మధ్య కుంపట్లు పెట్టడం ద్వారా తన స్థానాన్ని భద్రం చేసుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విభజన ధోరణితో పార్టీలో ఐక్యత పూర్తిగా దెబ్బతిందన్న ఫీలింగ్ ఉంది. ఒకే పార్టీలో ఉంటూ శత్రువుల్లా చూసుకునే పరిస్థితి దాపురించిందని.. ఈ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎలా తేవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు స్థానిక నాయకులు. అలా చెప్పకుండా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా.. ఏం చేయలేక సతమతమవుతున్నారట.

కొత్త రక్తాన్ని అణచివేయడం, సోషల్ మీడియాపై ఆంక్షలు
నియోజకవర్గంలో మరెవ్వరూ నాయకులుగా ఎదగకుండా చేయాలనే పక్కా వ్యూహంతో ప్రస్తుత కాంగ్రెస్ ఇంఛార్జి వ్యవహరిస్తున్నారన్నది ఆయనపై ప్రధానంగా ఉన్న విమర్శ. కొత్త నాయకులు ముందుకు వస్తే తన పదవులకు ఎసరు వస్తుందనే భయంతో వారిని తొక్కిపెడుతున్నారట. సమర్థులైన యువ నాయకులకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారట. ఈ వ్యూహాత్మక అణచివేత వల్ల పార్టీలో కొత్త నాయకత్వం తయారు కావడం లేదన్నది వారి అభిప్రాయం. ఈ మధ్యకాలంలో పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో స్వేచ్ఛగా పోస్టులు పెట్టలేకపోతున్నారట. పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలన్నా కొన్ని వర్గాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వస్తోందట. సొంత పార్టీ నాయకుల తప్పులను ప్రశ్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారట. ఈ ఆంక్షలతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆధునిక రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. యువత దీనిని ఆయుధంగా చేసుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. అలాంటి యువతపై ఆంక్షలు విధించడం వల్ల వారు తీవ్ర నిరుత్సాహానికి గురై పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రత్యర్థుల పోస్టులకు సైతం రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నారు. చురుకుగా పనిచేసే సోషల్ మీడియా సోల్జర్స్‌ను పక్కన పెట్టడం వల్ల పార్టీ తరఫున గొంతు వినిపించే వారే లేకుండా పోయారన్నది నియోజకవర్గంలో విన్పిస్తూన్న మాట.
సీఎం రేవంత్ రెడ్డికి చేరని వాస్తవ సమాచారం
సమావేశాలకు పిలవకపోవడం, ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల కార్యకర్తలలో మనోవేదన పెరుగుతోంది. తాము కేవలం జెండాలు కట్టడానికే పరిమితమా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాలకు కనీస విలువ ఇవ్వని నాయకత్వం తమకెందుకని నిలదీస్తున్నారు. ఈ మనోవేదన రాబోయే రోజుల్లో పెద్ద తిరుగుబాటుకు దారితీసేలా ఉందన్నది నియోజకవర్గంలో ఓపెన్ టాక్. కూకట్‌పల్లిలో జరుగుతున్న ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి సమాచారం అందకుండా జాగ్రత్తపడుతున్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గంలో పార్టీ ఇంతలా దిగజారుతున్నా అధిష్ఠానం మౌనంగా ఉండటానికి కారణం సమాచారం లేకపోవడమేనట. స్థానిక నాయకత్వంపై వస్తున్న ఆరోపణల నివేదికలు సీఎం దృష్టికి వెళ్లకుండా కొందరు మేనేజ్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారని, మిగిలిన సమయాల్లో వారిని కడు హీనంగా చూస్తారనే విమర్శలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. ఓట్లు కావాలన్నప్పుడు కాళ్లు పట్టుకునే నాయకులు, గెలిచిన తర్వాత కనీసం ముఖం కూడా చూపించడం లేదని వాపోతున్నారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండే నాయకత్వం కావాలని స్థానికులు కోరుతున్నారు.
కమ్మ కార్పొరేషన్ పదవితో ఏం లాభం?
కీలక కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండి రమేశ్‌కు అవకాశం లభించిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆ పదవిని కేవలం తన వ్యక్తిగత హోదా కోసమే వాడుకోకుండా.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న లాజిక్ మిస్ అవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నెలకొందన్నది కార్యకర్తల మాట. అసలే అంతంత మాత్రంగా పార్టీ గురించి ఆలోచించే ఆయన, ప్రభుత్వ పదవి వచ్చిన తర్వాత పార్టీని పూర్తిగా గాలికొదిలేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పదవికి తగ్గట్టుగా కనీస పనులు కూడా చేయడం లేదని… సొంతంగా ఏమైనా చేయగలిగిన ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ.. పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదన్నది సగటు కార్యకర్త నుంచి వచ్చే మాట. భోజన సమయం దాటినా కూడా.. కనీసం మంచినీళ్లు, భోజనం సౌకర్యాలు కూడా లేవన్న కంప్లైంట్ నిజంగా ఆలోచించాల్సిన విషయం. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నేతలు.. ఆ భావన వీడటం అన్యాయమన్నది వారి ఫీలాసఫీ. పార్టీ కార్యకర్తలకు కనీస మర్యాద దొరకని చోట.. ఎంత ఉంటే ఏం లాభమంటున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టకపోయినా.. కనీస గౌరవం ఇవ్వనక్కర్లేదా అన్నది వారి థియరీ. ఇదే అభిప్రాయం తాజాగా నియోజకవర్గంలో జరిపిన సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఆదరణ ఉన్నప్పటికీ వారిని ఓన్ చేసుకునేవారే కరువయ్యారన్న భావన వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నప్పటికీ.. వాటిని పార్టీ పరంగా ప్రచారం చేసుకోలేకపోవడం అత్యంత బలహీనతని సర్వేలో తేలింది. త్వరలో కూకట్‌పల్లి సమగ్ర సర్వే నా దేశం పత్రిక ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం.

బాలాజీనగర్ డివిజన్ గందరగోళం
బాలాజీనగర్ డివిజన్‌లో స్థానిక నాయకత్వంపై అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ స్థానిక నాయకులను సమన్వయం చేయడంలో ముఖ్య నాయకుడు పూర్తిగా విఫలమయ్యారన్న వర్షన్ ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయట. డివిజన్ స్థాయిలో పార్టీ క్యాడర్ విచ్ఛిన్నం అవుతున్నా పట్టించుకోవడం లేదట. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి నిలబడిన రెడ్డి సామాజికవర్గ నాయకులు.. తమ పరిస్థితేంటన్నది అర్థం కాక తలపట్టుకుంటున్నారట. పార్టీ కోసం కొత్తగా ముందుకు రావాలని చూస్తున్న రెడ్డి సామాజికవర్గ యువకులను ప్రోత్సహించే పరిస్థితి లేదన్న వెర్షన్ ఇక్కడ బలంగా విన్పిస్తోంది. కేవలం వారిని ప్రచారానికి వాడుకుని, పదవుల విషయానికి వచ్చేసరికి మొండిచేయి చూపుతున్నారని విమర్శ ఉంది. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వివక్ష చూపడం వల్ల పార్టీ నష్టపోతోందన్నది అసలు మేటర్.
ప్రజా సమస్యల విస్మరణ
ప్రజల మధ్య ఉంటూ వారి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన నాయకులు ఎయిర్ కండిషన్ రూములకే పరిమితమైతే పార్టీ ఎలా నిలదొక్కుకుంటుందన్న వెర్షన్ ఉంది. రోడ్ల దుస్థితి, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు కూకట్‌పల్లిలో చాలానే ఉన్నాయి. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తూ.. అధికార పార్టీకి మైలేజ్ తేవాల్సిన నాయకత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందన్న వాదన ఉంది. ప్రజలతో మమేకం కాకపోవడంతో నేతలు, ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారన్నది వేరే చెప్పనక్కర్లేదు. స్థానిక రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువవుతోందనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో తన కూతురిని రాజకీయాల్లోకి తీసుకురావడానికే ఇప్పుడు అన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారని టాక్ నడుస్తోంది. వారసులకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఇతర సమర్థులైన నాయకులను ఎదగకుండా చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక అంతర్గత సర్వేలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పరిస్థితిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఐడెంటిటీ కోల్పోతోందని.. ఆ సర్వే ద్వారా వెల్లడైంది. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని నివేదికలు చెబుతున్నాయి. పార్టీ ఎక్కడుంది అని కార్యకర్తలే ఆశ్చర్యంగా ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. కేవలం పేపర్ల మీద, ఫ్లెక్సీల మీద తప్ప జనం మధ్య కాంగ్రెస్ కనిపించడం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది.
కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి హెచ్చరిక
కూకట్‌పల్లి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక నాయకుడి గురించి జరిగే చర్చ మాత్రమే కాదు… పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు పెద్దవిగా మారితే దాని మూల్యం మొత్తం పార్టీ చెల్లించాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న అసంతృప్తి నిజమా కాదా అన్నది అధిష్ఠానం వెంటనే పరిశీలించి, వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఉంది. పార్టీని బలోపేతం చేసే నాయకత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప, కార్యకర్తలను నిర్వీర్యం చేసే రాజకీయాలకు కాదు. కూకట్‌పల్లి వంటి కీలక నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించి, పార్టీకి నష్టం కలిగించే అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న డివిజన్ నాయకులతో మాట్లాడితే అది పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందన్న వెర్షన్ ఉంది.
పార్ట్ 2- కారు వెనుక “బండి”.. కార్యకర్తకు గండి.. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ “కృష్ణా”ర్పణం











