భక్తులకు దివ్య దర్శనం… స్వర్ణ కవచంలో మలయప్పస్వామి

59

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం
ముగిసిన మూడు రోజుల మహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఆదివారం వైభవంగా ముగిసింది. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణ కవచంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఇక వచ్చే జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు ఈ బంగారు కవచంతోనే దర్శనమివ్వనున్నారు. ఈ దృశ్యాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి, దేవేరులకు స్నపన తిరుమంజనం నిర్వహించి స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వామివారు స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

 

#Tirumala #Tirupati #TTD #SrivariTemple #SriVenkateswaraSwamy #Jyeshtabhishekam #MalayappaSwamy #SriDevi #BhooDevi #TempleFestival #HinduTemple #SpiritualNews #Devotional #TTDNews #BreakingNews #LatestNews #AndhraPradesh #TeluguNews #TirumalaTemple #DevotionalNews