ఖనిజ విప్లవం… రాష్ట్రవ్యాప్తంగా మినరల్ మ్యాపింగ్

70

ఏపీ సంపదకు చంద్రబాబు ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దాగి ఉన్న విలువైన ఖనిజ నిల్వలను గుర్తించడానికి వెంటనే మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్ తో పాటు వ్యూహాత్మక లోహాలు లభించే అన్ని ప్రాంతాలను స్పష్టంగా మ్యాపింగ్ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికితీసే ప్రతి ఖనిజానికి విలువ జోడించేలా… వ్యాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ ప్రక్రియలను ఇక్కడే నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీనివల్ల రాష్ట్ర ఖనిజ సంపద మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతుందని ఆయన వివరించారు.

విలువ జోడింపుతో భారీ ఆదాయం
బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా వంటి ఖనిజాలను కేవలం ముడి రూపంలో కాకుండా శుద్ధి చేసి విక్రయించడం ద్వారా గరిష్ట ఆదాయాన్ని ఆర్జించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేవలం ఖనిజ ఆదాయం వల్లే రెవెన్యూ మిగులు సాధించాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఖనిజాల విలువ జోడింపు కోసం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాలలో లభించే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ పై ఒక ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ వంటి హై వాల్యూ నిల్వలపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

బంగారు నిల్వలపై ప్రత్యేక అధ్యయనం
రాష్ట్రంలో జొన్నగిరితో పాటు చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద ఉన్న బంగారం నిల్వలపై, మిగిలిన ఇతర బ్లాకులపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాలలో ఇప్పటికే రకరకాల బల్క్ ఖనిజాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 18 శాతం వృద్ధి నమోదైనట్లు వారు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ గనుల తవ్వకాలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని ఆదేశించారు.

ఉచిత ఇసుకపై సాంకేతిక నిఘా
ప్రజల సంక్షేమం కోసమే ఇసుకపై వచ్చే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఉచిత ఇసుక సామాన్యులకు సద్వినియోగం అయ్యేలా తవ్వకాలు, సరఫరాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా నిరంతరం విశ్లేషించాలని ఆదేశించారు. ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అమర్చాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#AndhraPradesh #ChandrababuNaidu #MineralMapping #Mining #RareEarthMinerals #CriticalMinerals #ValueAddition #IndustrialDevelopment #NaturalResources #APDevelopment #GoldMining #Jonnagiri #Chigurugunta #FreeSandPolicy #Infrastructure #EconomicGrowth #BreakingNews #LatestNews #AndhraNews #TeluguNews