చంద్రబాబును నేరుగా ప్రశ్నించిన మాజీ సీఎం.
మెగా డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని నేరుగా ప్రశ్నించారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఆధారాలు బయటకు వస్తున్నా.. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించకుండా ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోందని నిలదీశారు. యువతను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను రాజీనామా చేయించాల్సింది పోయి.. అధికారాన్ని ఉపయోగించి ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో ఓ అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు అవసరమైతే.. 65 మార్కులు మాత్రమే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అనర్హత బయటపడినా పోస్టు ఎలా కేటాయించారని, దరఖాస్తు దశలోనే తిరస్కరించాల్సిన వ్యక్తి చివరి వరకు వెళ్లి ఉద్యోగం ఎలా పొందారని జగన్ నిలదీశారు.
డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ వరకూ ప్రశ్నలు
డీఎస్సీ-2025లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులే దర్యాప్తు చేస్తే అది నిజంగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. అందుకే మొదటి నుంచీ డీఎస్సీ నియామకాలను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ నియామకాలపైనా జగన్ కీలక ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అనుమతులు పొందిన అటవీశాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, మెయిన్స్ పరీక్షలు పూర్తిచేసిన తర్వాత.. డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4 ఆధారంగా 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్లతో భర్తీ చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఈ వ్యవహారం కూడా బయటపడుతుందనే భయంతో నియామకాలను నిలిపివేశారని, మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా ఆపేశారని ప్రశ్నించారు. ఉద్యోగార్థులకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిజాలు దాగవని స్పష్టం చేస్తూ.. మెగా డీఎస్సీతో పాటు జీవో నంబర్ 4 ఆధారంగా జరిగిన అన్ని నియామకాలను సీబీఐకి అప్పగించాలని జగన్ మరోసారి డిమాండ్ చేశారు.
#MegaDSC #YSJagan #JaganMohanReddy #ChandrababuNaidu #NaraLokesh #DSCRecruitment #APPSC #CBIProbe #GO4 #SportsQuota #AndhraPradeshPolitics #JobRecruitment #TeacherRecruitment #APNews #PoliticalNews











