- పోస్టర్ విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు
- ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శ
పులివెందుల, నాదేశం ప్రతినిధి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అనే పోస్టర్‌ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ మధుసూదన్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో అనేకం ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ముఖ్యంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పింఛన్లు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఎదురుచూస్తున్నారని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పింఛన్ అర్హులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో సంక్షేమ హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.










