నెక్స్ట్… కాపు బాపు..! ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం గురించి మాట్లాడితే కాపు సామాజికవర్గం పేరు తప్పకుండా వినిపిస్తుంది. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగలిగే శక్తి ఈ వర్గానికి ఉందని గత నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర చెబుతోంది. అయితే ఈ వర్గానికి చెందిన నాయకత్వం మాత్రం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఒకప్పుడు వంగవీటి మోహనరంగా ఆవేశానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే… తరువాత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి ప్రధానమైన ఐకాన్‌గా మారారు. అయితే ముద్రగడ మరణానంతరం “ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు?” అనే ప్రశ్న కాపు సమాజంలో ఇపుడు బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ రాజకీయంగా అనూహ్యమైన చర్చకు దారితీసింది. ఎన్నో రకాల మలుపులకు వేదికగా మారింది. మారబోతుంది కూడా. అధికార టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో ఒకే వేదికపై కనిపించడం సాధారణ రాజకీయ మర్యాదగా చూడాలా, లేక భవిష్యత్ రాజకీయ సంకేతంగా అర్థం చేసుకోవాలా అనే తీవ్రమైన చర్చ మొదలైంది. వేదికపై ఇద్దరూ పరస్పరం ఆప్యాయంగా మెలగడం మీడియా, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఈ పరిణామాల తర్వాత టీడీపీ అధిష్ఠానం స్పందించిన తీరు కూడా రాజకీయ ఆసక్తిని మరింత పెంచింది.
కాపు కోణంలో బొండా కామెంట్లు కలకలం
బొండా ఉమ నుంచి వివరణ కోరాలని పార్టీ నాయకత్వం సూచించడం… దీనిపై అంతర్గత చర్చలు జరగడం కాపు సామాజికవర్గంలో భిన్న స్పందనలకు దారితీసింది. “ఒక సంస్మరణ సభలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కలుసుకోవడంలో తప్పేంటి?” అనే ప్రశ్నను పలువురు కాపు నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. వారు గుర్తు చేస్తున్న ఉదాహరణలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. నందమూరి తారకరత్న మరణ సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలు పరస్పరం పరామర్శించుకోవడం, ఇటీవలి కాలంలో వేర్వేరు పార్టీల నాయకులు సామాజిక.. వ్యక్తిగత సందర్భాల్లో ఒకరినొకరు పలకరించుకోవడం రాజకీయాల్లో అసాధారణం కాదని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు ముద్రగడ వంటి కాపు ఉద్యమ నేత సంస్మరణ సభలో బొండా, అంబటి కలిసి కనిపించడం ఎందుకు వివాదంగా మారిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అసలు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అంశం బొండా ఉమ చేసిన వ్యాఖ్యలేనని పరిశీలకులు భావిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా 2019లో టీడీపీ ఓటమికి ఒక కారణమని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే గత రాజకీయ నిర్ణయాలపై ఇంత స్పష్టంగా మాట్లాడటం సాధారణ విషయం కాదు. అందుకే ఈ వ్యాఖ్యలు టీడీపీలో అంతర్గతంగా కూడా చర్చకు దారితీశాయి.
కాపు రాజకీయాల్లో బొండా కేంద్రబిందువా?
ఇక్కడే మరో రాజకీయ కోణం కనిపిస్తోంది. బొండా ఉమ కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? లేక కాపు సామాజికవర్గంలో పెరుగుతున్న భావోద్వేగాలను పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఈ వ్యాఖ్యల తర్వాత కాపు సామాజికవర్గంలో ఆయనపై చర్చ పెరిగిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం పాత్ర ఎప్పుడూ కీలకమే. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ వర్గానికి చెందిన అనేక మంది నాయకులు ఎదిగారు. అయితే కాలక్రమేణా “పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం తగ్గిందనే” భావన అప్పుడప్పుడు బయటపడుతూ వచ్చింది. అలాంటి సమయంలో ముద్రగడ మరణం, బొండా వ్యవహారం, అనంతర పరిణామాలు ఈ చర్చను మళ్లీ ముందుకు తెచ్చాయి. మరోవైపు కూటమి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాపు సమాజానికి అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఉన్నారు. జనసేన అధినేతగా మాత్రమే కాకుండా అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కూడా ఆయన పాత్ర ఉంది. అలాంటి పరిస్థితిలో కాపు రాజకీయాల్లో మరో శక్తివంతమైన స్వరం అవసరమా? లేక ఇప్పటికే ఉన్న నాయకత్వమే సరిపోతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది.
కాపు నాయకత్వంపై మళ్లీ మొదలైన చర్చ
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజికవర్గంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశాలు, కూటమి సమీకరణాల్లో సమతుల్యత పాటించే ప్రయత్నాలు, సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి ఇవన్నీ ఆ దిశలోనే చూస్తున్నవారు ఉన్నారనే. విశ్లేషణలు కూడా విహరిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికార పార్టీలో ఏ చిన్న అసంతృప్తి కనిపించినా దాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకోవాలనే ప్రయత్నం ప్రతి ప్రతిపక్షం చేస్తుంది. బొండా వ్యవహారం కూడా అలాంటి అవకాశంగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది. కాపు సామాజికవర్గంలో మరో భావోద్వేగ అంశం కూడా కనిపిస్తోంది. వంగవీటి మోహనరంగా తర్వాత ముద్రగడ పద్మనాభం వరకు ఒక ఉద్యమ నాయకత్వం కనిపించిందని, ఇప్పుడు అలాంటి ధైర్యంగా మాట్లాడే, అవసరమైతే అధికారాన్నే ప్రశ్నించే నాయకుడు ఎవరు అనే చర్చ అదే సామాజిక వర్గంలో సాగుతోందని కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ అజెండాగా కాపు ఆత్మగౌరవం అంశం
అయితే ఈ అభిప్రాయం మొత్తం కాపు సమాజం అభిప్రాయమేనని చెప్పడం సరైంది కాదనిపిస్తోంది. ఇది ఆ వర్గంలోని కొంతమంది వ్యక్తం చేస్తున్న రాజకీయ భావనగా చూడాల్సిందేనని పరిశీలకులు చెప్పుకుంటున్న మాట. మొత్తంగా చూస్తే, ముద్రగడ సంస్మరణ సభ ఒక నివాళి కార్యక్రమం మాత్రమే కాకుండా కాపు రాజకీయాల భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరతీసిన వేదికగా మారింది. బొండా ఉమ వ్యవహారం టీడీపీకి సంబంధించిన క్రమశిక్షణ అంశమా? లేక పెద్ద రాజకీయ సంకేతమా? అనేది ఇప్పుడే తేల్చలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నాయకత్వం, కాపు ఆత్మగౌరవం, కాపు ఓటు బ్యాంక్ అనే అంశాలు మళ్లీ రాజకీయ చర్చల కేంద్రబిందువుగా మారుతున్నాయి. ఈ చర్చ ఎటువైపు మలుపు తిరుగుతుందో… ఆ సమాధానమే రాబోయే రాష్ట్ర రాజకీయాల దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.











