సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని విమర్శించారు. కేంద్రానికి 49 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్న సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ అని గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఎన్టీపీసీకి సరఫరా అవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొత్త బొగ్గు బ్లాకులు కోల్పోయిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిని ఉపయోగించారని విమర్శించారు.
కొత్త బ్లాకులతో ఉద్యోగాల ఆశ
2015లో కేంద్రం ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన అనుమతులు సాధించామని చెప్పారు. తాడిచర్ల-2 బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయించామని వెల్లడించారు. మణుగూరు బ్లాక్ వేలంలో తెలంగాణ జెన్కో పోటీ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాస్తానని తెలిపారు. ఈ మూడు బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కితే సుమారు 6,500 ఉద్యోగాలు లభిస్తాయని, 830 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.1.95 లక్షల కోట్ల టర్నోవర్ సాధించే అవకాశం ఉందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కఠిన చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం బాధాకరమని, విద్యార్థుల్లో ధైర్యం నింపడం అందరి బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
#Singareni #SingareniCoalCompany #KishanReddy #KCR #Congress #TelanganaPolitics #CoalMines #CoalBlocks #BRS #TelanganaNews #MiningIndustry #GovernmentNews #PoliticalNews #BreakingNews #Telangana











