భూవివాదాలపై న్యాయ విచారణకు సిద్ధమా?
కేసీఆర్‌పై వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ సవాల్
కేసీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. “నా ఇల్లు తీస్తే నీకెందుకు బాధ అని రేవంత్‌రెడ్డి అంటున్నారు.. కానీ నా బాధ ప్రజల బాధ” అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 22ఏ జాబితా నుంచి ప్రభుత్వ పెద్దల భూములు తొలగించే విధానం ఉంటే, అదే నిబంధనలు సామాన్యుల భూములకు కూడా వర్తించాలని డిమాండ్ చేశారు. ప్రజల భూముల సమస్యలకు పరిష్కారం చూపకుండా రాజకీయ విమర్శలతో సరిపెట్టవద్దని అన్నారు.
ధరణి నుంచి భూభారతి వరకు విచారణ
భూముల వ్యవహారంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన అవకతవకలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతిలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు ప్రకటించారు. అధికారుల ఆధ్వర్యంలో కాకుండా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన వ్యవహారాలతో పాటు 2023 డిసెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన భూ లావాదేవీలను కూడా పరిశీలించాలని కోరారు. తమ ఆస్తులు, రేవంత్‌రెడ్డి ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల పెరుగుదలపైనా న్యాయ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.
రేవంత్ కుటుంబ భూములపై కొత్త ఆరోపణలు
రేవంత్‌రెడ్డి కుటుంబానికి సుమారు 308 ఎకరాల భూమి ఉందన్న సమాచారం తమకు అందిందని హరీశ్‌రావు తెలిపారు. ఆ భూములకు సమీపంలో ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీ పరిసరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఆరోపణలపై కూడా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. “నీ ఆస్తులు.. మా ఆస్తులు.. రెండు ప్రభుత్వాల భూ వ్యవహారాలు అన్నీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిద్దాం.. నువ్వు సిద్ధమా రేవంత్‌రెడ్డి?” అంటూ హరీశ్‌రావు బహిరంగ సవాల్ విసిరారు.
#HarishRao #RevanthReddy #TelanganaLandRow #Dharani #BhuBharati #22ALands #JudicialProbe #LandInquiry #BRS #Congress #KCR #TelanganaAssembly #LandDispute #TelanganaPolitics #308Acres











