Home Telangana మమత గీసిన గుర్తుకే ఇప్పుడు చిక్కులు

మమత గీసిన గుర్తుకే ఇప్పుడు చిక్కులు

తృణమూల్‌ సింబల్‌‌ను ఫ్రీజ్ చేసిన ఈసీ.

1998లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన మమతా బెనర్జీ స్వయంగా గీసిన ‘జోడా ఘాస్‌ ఫూల్‌’ గుర్తు ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత పోరుకు కేంద్రంగా మారింది. తృణమూల్‌ కాంగ్రెస్‌లో చీలిక నేపథ్యంలో మమతా వర్గం, తిరుగుబాటు వర్గం పార్టీ పేరు, గుర్తుపై హక్కు కోరాయి. ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం సరిపోలేదని పేర్కొన్న ఎన్నికల సంఘం, అక్టోబర్‌ 6 ఉప ఎన్నికల వరకు అసలు పార్టీ పేరు, గుర్తును తాత్కాలికంగా ఫ్రీజ్‌ చేసింది.

రెండు వర్గాలకు కొత్త గుర్తులు

తుది నిర్ణయం వచ్చే వరకు రెండు వర్గాలు వేర్వేరు పేర్లు, గుర్తులతో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. మమతా వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుర్తు, అరూప్‌ రాయ్‌ వర్గానికి ‘డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరుతో ఎన్వలప్‌ గుర్తు కేటాయించారు. ఈ వ్యవహారం ఎన్నికల గుర్తుల కేటాయింపుపై గతంలో ఏర్పడిన వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా 1969లో ఇందిరాగాంధీ వర్గం, కాంగ్రెస్‌ పాత నాయకత్వం మధ్య జరిగిన చీలికలో ఎన్నికల సంఘం అనుసరించిన విధానం ఇప్పుడు కీలకంగా మారింది.

ఇందిరా కేసులో మూడు పరీక్షలు

1969 కాంగ్రెస్‌ వివాదంలో ఎన్నికల సంఘం పార్టీ లక్ష్యాలు, పార్టీ రాజ్యాంగం, సంస్థాగత బలం అనే మూడు అంశాలను పరిశీలించింది. మొదటి రెండు అంశాల్లో స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సంస్థల ప్రతినిధుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంది. ఇందిరాగాంధీ వర్గానికి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో ఆ వర్గాన్నే అసలైన కాంగ్రెస్‌గా గుర్తించింది. తర్వాత శివసేన, ఎన్సీపీ వివాదాల్లోనూ ప్రజాప్రతినిధుల బలం కీలకంగా మారింది. ముఖ్యంగా ఎన్సీపీ కేసులో సంస్థాగత నిర్మాణంపై స్పష్టత లేకపోవడంతో లెజిస్లేటివ్‌ వింగ్‌లో మెజారిటీని ఆధారంగా తీసుకున్నారు.

జూన్‌ 22 సమావేశమే కీలకమా?

తృణమూల్‌ వివాదంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఉన్న ప్రశ్నలు కీలకంగా మారాయి. జూన్‌ 22న అరూప్‌ రాయ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం చెబుతోంది. మమతా వర్గం మాత్రం ఆ సమావేశం చెల్లదని వాదిస్తోంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ ఎన్నికల సంఘం తాత్కాలిక నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. చివరకు పార్టీ పేరు, ‘జోడా ఘాస్‌ ఫూల్‌’ గుర్తుపై హక్కు ఎవరికి దక్కుతుంది? అన్నది ఎన్నికల సంఘం తుది నిర్ణయంతో తేలనుంది.

#MamataBanerjee #TMC #TrinamoolCongress #TMCsymbol #JoraGhashPhul #ElectionCommission #TMCsplit #TMCDispute #MamataFaction #ArupRoy #FootballPlayerSymbol #EnvelopeSymbol #WestBengalBypolls #PoliticalPartySymbol #IndianPolitics