Home Telangana పొత్తు ఊహాగానాలకు తెర బీజేపీతో పొత్తు ఉండదన్న కేటీఆర్

పొత్తు ఊహాగానాలకు తెర బీజేపీతో పొత్తు ఉండదన్న కేటీఆర్

2028 ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన.
డీలిమిటేషన్‌కు దామాషా ప్రాతిపదికే షరతు.

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. హరియాణాలోని సోనిపట్‌లో ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్టార్టప్‌ స్టేట్‌’ అంశంపై ఉపన్యాసం ఇచ్చిన కేటీఆర్‌ అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 2028 ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా ‘బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు’ అని సమాధానం ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పొత్తు ఊహాగానాలకు కేటీఆర్‌ ప్రకటనతో స్పష్టత వచ్చింది.

దామాషా పెంపునకే మద్దతు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపైనా కేటీఆర్‌ తన వైఖరిని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను దామాషా ప్రాతిపదికన పెంచితే డీలిమిటేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్నారు. మొత్తం స్థానాలను దామాషా ప్రకారం పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చన్నది బీఆర్‌ఎస్‌ అభిప్రాయంగా వివరించారు. రాజకీయాలు, ప్రజా విధానాలు, డీలిమిటేషన్‌ అంశాలతో పాటు విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు.

తెలంగాణ అభివృద్ధి నమూనా ప్రస్తావన

తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరిస్తూ కేటీఆర్‌ సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కరవు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే ఇంజినీరింగ్‌ పరిష్కారంగా అభివర్ణించారు. 2014-15లో సుమారు 44.4 లక్షల టన్నులుగా ఉన్న వరి ఉత్పత్తి 2023-24 నాటికి 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌, టాస్క్‌ వంటి సంస్థల ద్వారా తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చెందిన తీరును వివరించారు. కృత్రిమ మేధపై స్పందిస్తూ కొత్త సాంకేతికతను భయపడకుండా స్వీకరించి ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

 

#KTR #KTRNews #BRS #BJP #BRSBJP #TelanganaElections2028 #2028Elections #TelanganaPolitics #Delimitation #ProportionalRepresentation #LokSabhaDelimitation #SouthIndia #KTRSpeech #TelanganaDevelopment #BRSPolitics