ప్రశ్నావళిపై రాహుల్, ఖర్గే అభ్యంతరం
జనగణనలో కులగణన విధానం సరిగా లేదని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం ఇద్దరూ సుదీర్ఘ లేఖ రాశారు. కులగణనలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులాల నమోదుకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఎండెడ్’ విధానం గందరగోళానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఒకే కులం వేర్వేరు పేర్లతో నమోదు అయితే లక్షల సంఖ్యలో కులాల పేర్లు నమోదయ్యే అవకాశం ఉందని, అప్పుడు అసలు లెక్కింపు డేటా ఉపయోగం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నావళిలో ‘వెనుకబడిన వర్గాలు’ అనే పదం లేకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న విధంగానే బీసీ, ఓబీసీలకు కూడా ‘డ్రాప్‌డౌన్ జాబితా’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
తెలంగాణ, బిహార్ నమూనాలు ప్రధానికి
కులగణన కోసం తెలంగాణలో 2024లో, బిహార్‌లో 2022లో ఉపయోగించిన కులాల జాబితా నమూనాలను రాహుల్ గాంధీ, ఖర్గే ప్రధానికి పంపించారు. ప్రస్తుత ప్రశ్నావళిని వెంటనే రద్దు చేసి కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, నిపుణులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కులాల లెక్కింపు కచ్చితంగా జరిగితేనే సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సరైన సమాచారం లభిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కులగణన అంశాన్ని రిజర్వేషన్లు, సామాజిక న్యాయంతో ముడిపెడుతూ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. కులాల సంఖ్యకు అనుగుణంగా విధానాలు రూపొందించేందుకు ఖచ్చితమైన డేటా అవసరమని కాంగ్రెస్ వాదిస్తోంది.
8.2 లక్షలకు పైగా పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2015లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాని పోస్టులు 4.21 లక్షలు ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య 8.24 లక్షలకు చేరిందని తెలిపారు. రైల్వేల్లో 2.40 లక్షలు, కేంద్ర హోంశాఖ పరిధిలో 1.10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో కూడా 2.41 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 5.1 లక్షల శాశ్వత ఉద్యోగాలు రద్దయ్యాయని, కాంట్రాక్ట్ ఉద్యోగాల వాటా 19 శాతం నుంచి 49 శాతానికి పెరిగిందని ఆరోపించారు. ఈ పరిస్థితి ఉపాధి సమస్య మాత్రమే కాదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల సామాజిక న్యాయంతోనూ ముడిపడి ఉందని ఖర్గే అన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న 8.7 కోట్ల మంది యువత చదువు, ఉపాధికి దూరంగా ఉన్నారని నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావించారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ప్రియాంక గాంధీ విమర్శించారు.
#RahulGandhi #MallikarjunKharge #CasteCensus #TelanganaModel #CasteSurvey #Telangana #Congress #NarendraModi #CasteEnumeration #OBC #BC #SocialJustice #CasteData #BiharCasteCensus #Unemployment #CentralGovernmentJobs #IndiaPolitics











