తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 20 రోజులుగా విద్యార్థులు జీవో 97 రద్దు కోసం పోరాడుతున్నారని, వారి ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను కలిసిన హరీశ్‌రావు.. పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో కలిపి స్కిల్ యూనివర్సిటీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 113 పాలిటెక్నిక్ కళాశాలల్లో 59 ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు విధానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం వల్ల లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం తక్కువ ఫీజుతో పాలిటెక్నిక్ చదివి, ల్యాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే అవకాశం ఉందని, కొత్త విధానంతో ఆ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఫీజులు పెరగవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగుతుందని ప్రభుత్వం ఎలా హామీ ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 7లోపు జీవో రద్దు చేయాలి
విద్యార్థుల ఉద్యమాన్ని ప్రభుత్వం తక్కువగా అంచనా వేయొద్దని హరీశ్‌రావు హెచ్చరించారు. జెన్‌జీ కేవలం రీల్స్, వీడియోలకే పరిమితం కాదని.. అవసరమైతే తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కి పోరాడే శక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ జంతర్‌మంతర్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోనూ విద్యార్థుల పోరాటం ఉధృతమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు జీవో 97ను రద్దు చేయాలని, లేకపోతే లక్ష మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే బీఆర్ఎస్ తరఫున తానే ముందుండి పోరాడతానని ప్రకటించారు. పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తూ.. ఈ ప్రభుత్వానికే గ్యారెంటీ లేదని మాట్లాడుతున్న నేతలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎలా గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దని రేవంత్‌రెడ్డికి సూచించారు.
#HarishRao #Telangana #GO97 #PolytechnicStudents #StudentProtest #TelanganaStudents #PolytechnicColleges #BRS #RevanthReddy #TelanganaGovernment #GenZ #SkillUniversity #PolytechnicEducation #StudentIssues #TelanganaPolitics











