లావణ్య అరాచకాల వెనుక అసలు కథ!
నగదు మాయం తర్వాతే ఆరోపణల దుమారం
ఒక ఉద్యోగి చేసిన ఆరోపణలు.. ఓ ప్రముఖ హోటల్‌లో ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే అసలు కథ ఏమిటి? హోటల్ ది మనోహర్ యాజమాన్యం చెబుతున్న వివరాలు ఇప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా పనిచేసిన కొరపు లావణ్యపై హోటల్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసింది. రూ.లక్ష నగదు కనిపించకపోవడంపై ప్రశ్నించిన తర్వాతే వివాదం మొదలైందని తెలిపింది. ఆ తర్వాత చైర్మన్ కార్యాలయంలో ఆమె ప్రవర్తన, లాబీలో జరిగిన గందరగోళం, కీలక తాళం చెవులు అప్పగించకపోవడం వంటి అంశాలను యాజమాన్యం ప్రస్తావించింది. అంతేకాదు.. సంస్థ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆడియో ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను లావణ్య ఎలా సమర్థించుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు రూ.లక్ష నగదు వ్యవహారం ఏంటి? రూ.30 లక్షల డిమాండ్ వెనుక కథేంటి? లావణ్య ఆరోపణలు నిజమా? లేక నగదు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమా? ఇప్పుడు ఈ వివాదం చుట్టూ ఇవే ప్రశ్నలు హాట్‌టాపిక్‌గా మారాయి.

లావణ్య ఆరోపణలన్నీ అవాస్తవాలే
హైదరాబాద్‌లోని హోటల్ ది మనోహర్ మాజీ ఉద్యోగి కొరపు లావణ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని సంస్థ చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. లావణ్య 2025 డిసెంబర్ 1న ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా సంస్థలో చేరారని తెలిపారు. చైర్మన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఆకస్మిక మరణం తర్వాత 2026 జూలై నుంచి ఆమె చైర్మన్ కార్యాలయంలో విధులు నిర్వహించారని చెప్పారు. ఆగస్టు 17న ఆఫీస్ బ్యాగ్‌లో తీసుకొచ్చిన రూ.లక్ష నగదు కనిపించకుండా పోయిందని మనోహర్ తెలిపారు. కార్యాలయంలోకి ఎవరైనా వచ్చారా అని సిబ్బంది లావణ్యను ఫోన్‌లో అడగగా, ఎవరూ రాలేదని ఆమె సమాధానం ఇచ్చారని చెప్పారు. అనంతరం ఆమె దురుసుగా మాట్లాడటంతోపాటు తనపైనే ఆరోపణలు చేస్తూ అనుచిత సందేశాలు పంపారని పేర్కొన్నారు. ఆగస్టు 19న నగదు విషయంపై ప్రశ్నించగా ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై కేకలు వేశారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇద్దరు సీనియర్ మేనేజర్లను పిలిపించి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చామని మనోహర్ చెప్పారు. అయినా ఆమె హోటల్ లాబీలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఆమె 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారని తెలిపారు. కొన్ని గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి కొనసాగిందని, చైర్మన్ కార్యాలయానికి సంబంధించిన కీలక తాళం చెవులను అప్పగించేందుకు ఆమె నిరాకరించి వాటిని తనతో తీసుకెళ్లారని చెప్పారు.

రూ.30 లక్షల డిమాండ్ చేశారంటూ ఆరోపణ
హోటల్ నుంచి వెళ్లిన అనంతరం లావణ్య 36 నెలల జీతాన్ని డిమాండ్ చేశారని, ఆ డిమాండ్‌ను సంస్థ తిరస్కరించిందని చైర్మన్ తెలిపారు. జనరల్ మేనేజర్ ఉదయ్ సాహా, సీఎఫ్ఓ సీ చంద్రశేఖర్ ప్రసాద్, డైరెక్టర్ సత్య పింజల, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ శ్రీ శక్తి ప్రిన్సిపాల్ వై. అనిత చంద్రన్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. లావణ్య తమ సంస్థ నుంచి దాదాపు రూ.30 లక్షలు డిమాండ్ చేశారని, ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు తెలిపారు. ఈ డిమాండ్ బ్లాక్‌మెయిలింగ్ కిందకు వస్తుందని ఆరోపించారు. లావణ్య తనపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే చైర్మన్, జీఎం, సీఎఫ్ఓ, సీనియర్ మేనేజర్లపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ఆమె 2026లోనే సంస్థలో చేరారని, మీడియా ముందు చెప్పినట్లు 2023లో చేరలేదని స్పష్టం చేశారు. రూ.లక్ష నగదు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు.

పోష్ కమిటీకి ఫిర్యాదు చేయలేదని వెల్లడి
చైర్మన్ డీవీ మనోహర్ వయసు 73 సంవత్సరాలని, 52 ఏళ్ల సుదీర్ఘ వ్యాపార ప్రస్థానంలో ఆయనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హోటల్‌కు 30 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, ఇప్పటివరకు లైంగిక వేధింపులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. నిబంధనల ప్రకారం సీనియర్ మహిళా మేనేజర్ నేతృత్వంలో పోష్ కమిటీ పనిచేస్తోందని, అయితే లావణ్య ఆ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. చైర్మన్ కార్యాలయానికి సంబంధించిన కీలక తాళం చెవులను లావణ్య తిరిగి ఇవ్వకుండా తనతో తీసుకెళ్లారని హోటల్ యాజమాన్యం ఆరోపించింది. లాబీలో పోలీసులు, సిబ్బంది, అతిథుల సమక్షంలో గందరగోళం సృష్టించడం ద్వారా సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. లావణ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని, నగదు వ్యవహారం బయటపడిన తర్వాతే ఈ వివాదం మొదలైందని హోటల్ యాజమాన్యం తన వాదనను వెల్లడించింది.











