Home Telangana ఫీజులు లేవు.. విదేశీ విద్య ఎలా? విద్యార్థుల కష్టాలపై బండి ఫైర్

ఫీజులు లేవు.. విదేశీ విద్య ఎలా? విద్యార్థుల కష్టాలపై బండి ఫైర్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రపంచస్థాయి విద్య అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. ఫీజులు అందక కాలేజీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా వేదన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదా అని నిలదీశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల విద్యార్థులు ఫీజు బకాయిల కారణంగా ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు అడిగిన కాలేజీల యాజమాన్యాలను బెదిరించడం తప్ప ప్రభుత్వం సాధించిందేమీ లేదని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకేసారి చెల్లిస్తామని గతంలో ఇచ్చిన హామీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల సమస్య పరిష్కారం కాకపోతే విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ నిరాహార దీక్షకు బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల కారణంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. యూపీఐకి పదేళ్ల మైలురాయి సందర్భంగా స్నేహితులతో కలిసి కరీంనగర్‌లో కేంద్ర మంత్రి చాయ్ తాగుతూ వేడుక జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చాయ్ బిల్లు కూడా యూపీఐ ద్వారానే చెల్లించారు.

#BandiSanjay #Telangana #FeeReimbursement #TelanganaStudents #FeeDues #RevanthReddy #TelanganaGovernment #BJP #RamchanderRao #StudentIssues #Education #HigherEducation #FeeReimbursementDues #TelanganaPolitics #StudyAbroad #UPI #UPI10Years