Home Telangana తుమ్మిడిహెట్టికి నిధుల కొరత లేదు

తుమ్మిడిహెట్టికి నిధుల కొరత లేదు

మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామన్న ఉత్తమ్‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంశంపై బీజేపీ నేతలు మాట్లాడటం మానుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును స్పష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రాజెక్టు ముందుకు సాగేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో చర్చించి సహకరించాలని సూచించారు. నదీ జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజెక్టు అనుమతులపై సంబంధిత ప్రభుత్వాలు, సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్‌ తెలిపారు.

మిల్లర్ల సమస్యలపై నాలుగైదు రోజుల్లో మరో భేటీ

రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చల మార్గాన్ని ఎంచుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పెనాల్టీలు, టెండర్‌ ధరలు, స్టాక్‌ వ్యత్యాసాలు, పెండింగ్‌ సరఫరాలపై సమగ్రంగా చర్చించారు. మిల్లర్లను ప్రభుత్వం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూస్తుందని ఉత్తమ్‌ చెప్పారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధనం పరిరక్షణ, మిల్లింగ్‌ రంగం స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. మిల్లర్లు సమర్పించిన వినతులను సానుకూలంగా పరిశీలించి, సాధ్యమైన పరిష్కారాలు చూపుతామని తెలిపారు. పెండింగ్‌ సరఫరాలపై అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. నాలుగైదు రోజుల్లో మిల్లర్లతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొంటూ, మిల్లర్లు సమ్మె విరమించి ప్రభుత్వ చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

#Thummidihatti #ThummidihattiProject #UttamKumarReddy #TelanganaIrrigation #IrrigationProjects #TelanganaProjects #MaharashtraTelangana #InterstateWater #RiceMillers #TelanganaRiceMillers #RiceMilling #PaddyProcurement #TelanganaGovernment #IrrigationNews #TelanganaNews