Home Telangana రేవంత్‌-కేటీఆర్‌ మైత్రి ప్రజలకు తెలుసు

రేవంత్‌-కేటీఆర్‌ మైత్రి ప్రజలకు తెలుసు

బండి సంజయ్ సంచలన ఆరోపణలు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భూదోపిడీ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరూ రాజకీయ డ్రామాలు నడుపుతున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. రేవంత్‌-కేటీఆర్‌ మధ్య మైత్రి ఏంటో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఏఐసీసీకి ముడుపులు, బేరసారాల కోసమే సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

భూదోపిడీపై ఆధారాలెక్కడ?

బీఆర్‌ఎస్‌ లక్ష కోట్ల విలువైన భూదోపిడీకి పాల్పడిందని తేల్చేందుకు మూడేళ్లు పట్టిందా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారంటున్నారని, ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. ఆధారాలు బయటపెడితే ఆ భూములను తామే రక్షిస్తామని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి తలచుకుంటే మూడు గంటల్లోనే ఆధారాలు బయటపెట్టవచ్చన్నారు. కేటీఆర్‌ సుద్దపూస మాటలు ఆపాలని, పొత్తూర్‌ లాజిస్టిక్‌ పార్క్‌ నిర్వహణ, కొందరితో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నారంటూ విమర్శలు చేశారు.

వినాయక నిమజ్జనంపై హెచ్చరిక

హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకోబోమని బండి సంజయ్‌ హెచ్చరించారు. వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. కాలువల్లో నీరు విడుదల చేయకపోతే విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. పరిస్థితి చేయి దాటకముందే సమీక్ష చేయాలని సూచించారు. ప్రైవేట్‌ భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదన్నారు. రోజ్‌గార్‌ మేళాలో 200 మందికిపైగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఖైరతాబాద్‌ ఉపఎన్నిక అనివార్యమైతే బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

#BandiSanjay #RevanthReddy #KTR #TelanganaLandRow #LandEncroachment #BRS #Congress #BJP #PoliticalNexus #Sirisilla #JanwadaFarmhouse #KhairatabadBypoll #VinayakaImmersion #TelanganaPolitics #TelanganaNews