Home Telangana సుప్రీంకోర్టు గడప తొక్కిన దానం నాగేందర్

సుప్రీంకోర్టు గడప తొక్కిన దానం నాగేందర్

తెలంగాణ హైకోర్టు తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో సెప్టెంబర్‌ 18న హైకోర్టు దానంను అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం, అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. స్పీకర్‌ అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు పక్కనపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని దానం కోరినట్లు సమాచారం. ఈ పరిణామంలో మరో కీలక అంశం పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేయడం. తమకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని వారు కోర్టును కోరారు. ఆసక్తికరంగా, హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్‌ తీర్పును స్వాగతిస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని, ఎన్నికలు వస్తే మళ్లీ ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తానని చెప్పారు. అయితే మరుసటి రోజే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

 

#DanamNagender #SupremeCourt #DanamDisqualification #Khairatabad #KhairatabadBypoll #TelanganaHighCourt #BRS #Congress #AntiDefectionLaw #DefectionCase #PadiKaushikReddy #AletiMaheshwarReddy #SupremeCourtAppeal #TelanganaPolitics #TelanganaNews