హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు హెచ్‌ఎండీఏ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు దాదాపు 9 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. ఇందుకోసం తాజాగా టెండర్లను ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు ఈ నెల 22లోపు బిడ్లు దాఖలు చేయాలని అధికారులు సూచించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1,656 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం పనులను రెండు దశల్లో పూర్తి చేసేలా డీపీఆర్ రూపొందించారు. తొలిదశలో ఫిలింనగర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 5 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. రెండో దశలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హకీంపేట్ కుంట వరకు 4 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్‌లో మెట్రో రైలు విస్తరణ జరిగినా ఇబ్బంది లేకుండా కారిడార్‌ను డిజైన్ చేయడం ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశంగా అధికారులు చెబుతున్నారు.
ఆరు ర్యాంపులతో ట్రాఫిక్‌కు ఊరట
కొత్త ఎలివేటెడ్ కారిడార్‌పై రాకపోకలు సులభంగా సాగేందుకు ఆరు కీలక ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఫిలింనగర్ రోడ్డు నంబర్ 82, నార్నే రోడ్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 52, ఐటీసీ కోహినూర్ రోడ్, టీ-హబ్ జంక్షన్, మైండ్‌స్పేస్ ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. కారిడార్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీ చెక్‌పోస్టు, ఫిలింనగర్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ మార్గాల్లో పీక్ అవర్స్‌లో తీవ్ర రద్దీ నెలకొంటుండటంతో ప్రయాణికులు ఎక్కువ సమయం రోడ్డుపైనే గడపాల్సి వస్తోంది. కొత్త మార్గంతో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నగర నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వైపు వెళ్లే ప్రయాణం కూడా మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం తగ్గడం, కీలక జంక్షన్లపై వాహనాల ఒత్తిడి తగ్గడం ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రయోజనాలుగా నిలవనున్నాయి
#BanjaraHills #Gachibowli #ElevatedCorridor #HyderabadFlyover #HMDA #HyderabadTraffic #ITCorridor #ShilpaLayout #FilmNagar #JubileeHills #GachibowliTraffic #HyderabadInfrastructure #FlyoverProject #ElevatedRoad #HyderabadDevelopment #TelanganaInfrastructure #HMDATenders #TrafficRelief #HyderabadNews #TelanganaNews











