Home Telangana తాతా మధు, నవీన్‌ సస్పెన్షన్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు వేటు

తాతా మధు, నవీన్‌ సస్పెన్షన్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు వేటు

తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ ఆవరణ వివాదం కీలక మలుపు తీసుకుంది. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ కుమార్‌ రెడ్డిలపై శాసనమండలి సస్పెన్షన్‌ వేటు వేసింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు ఇద్దరినీ మండలి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. ఇద్దరిపై చర్యలకు మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టగా, ఛైర్మన్‌ మూజువాణి ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి ఆమోదం లభించడంతో ఇద్దరు ఎమ్మెల్సీలను సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు. అంతకుముందు ఇదే వ్యవహారంపై శాసనసభ కూడా తీర్మానం చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పీకర్‌ పదవి గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయడాన్ని సభ ఖండించింది. సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళల ఎదుట అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలను కూడా సభ ఖండించింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్‌ బాధ్యత వహించాలని, స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్నారు.

కోర్టు నుంచి విడుదల.. మండలిలోకి రాగానే

అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనపై తాతా మధు, నవీన్‌ కుమార్‌ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే పోలీసుల రిమాండ్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల బాండ్‌, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ష్యూరిటీలు సమర్పించిన తర్వాత ఇద్దరూ విడుదలయ్యారు. అనంతరం వారు శాసనమండలికి హాజరుకాగా అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేయడంతో సస్పెన్షన్‌ తీర్మానం మండలి ముందుకు వచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.

 

#TattaMadhu #TattaMadhusudhan #NaveenKumarReddy #BRSM LC #BRSMLC #BRSSuspension #TelanganaCouncil #TelanganaAssembly #GaddamPrasadKumar #SpeakerControversy #SpeakerInsultRow #GuttaSukhenderReddy #SridharBabu #DamodarRajanarsimha #BRS #Congress #TelanganaPolitics #MonsoonSession #NampallyCourt #AssemblyControversy #TelanganaNews