సీతక్కపై ప్రశంసలు.. ప్రత్యర్థులపై విమర్శలు
ములుగుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం
ములుగు కొత్త కలెక్టరేట్ సముదాయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క–సారక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించామని, రాష్ట్రంలోని గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మంత్రి సీతక్క అక్కగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. మేడారం సమ్మక్క–సారక్క ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ములుగు ప్రాంత అభివృద్ధికి సాగునీరు అత్యంత కీలకమని, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని, జంపన్నవాగును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఆదివాసీ యువతకు నైపుణ్యమే ఆయుధం
ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని రేవంత్ రెడ్డి అన్నారు. వారి కష్టాలు తొలగాలంటే సాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి పెట్టడంతో పాటు, ఆ తర్వాత నైపుణ్య విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యం కలిగితే జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనూ అవకాశాలు పొందవచ్చన్నారు. మహిళల కోసం ఇందిరమ్మ చీరలను సారెగా అందిస్తున్నామని, ఈ ఏడాది చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. రక్తసంబంధం లేకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నానని చెబుతూ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. రక్తసంబంధం ఉన్న సోదరినే ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకునే ప్రభుత్వం తమదేనని, ప్రజలు అండగా నిలిస్తే రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని రేవంత్ పిలుపునిచ్చారు.











