Home Telangana రైతులకు తీపి కబురు: జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల.. కేబినెట్ కీలక నిర్ణయం!

రైతులకు తీపి కబురు: జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల.. కేబినెట్ కీలక నిర్ణయం!

46
Telangana, Rythu Bharosa release date, Revanth Reddy cabinet decisions, Telangana farmer investment support, Fine rice bonus Telangana,

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సచివాలయంలో గురువారం జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. జూన్ 30 నుండి వరుసగా తొమ్మిది రోజుల పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

రైతులకు ఆర్థికదన్ను

రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పెట్టుబడి సాయాన్ని వానాకాలం, యాసంగి సీజన్లకు విడగొట్టి, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ. 6,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుత వానాకాలం సాగుకు ఈ నిధులు రైతులకు ఎంతో అండగా నిలవనున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈనెల 20న ప్రధాన మంత్రి కిసాన్ యోజన నిధులను విడుదల చేయనుంది. దీనివల్ల పది రోజుల వ్యవధిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది.

సన్నాలకు బోనస్, కేంద్రంపై ఆగ్రహం

రాష్ట్రంలో పండే ఏడు రకాల సన్న బియ్యం రకాలకు బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధాన్యం సేకరించడంపై కేబినెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఎరువుల కోటా, మెట్రో విస్తరణ

రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామగుండంలో తయారయ్యే యూరియాలో ఎక్కువ శాతం తెలంగాణకే కేటాయించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని, ఐఆర్ఎఫ్‌సీ నుంచి రావాల్సిన రుణాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టుల అనుమతులకు తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

డిజిటల్ క్యాబినెట్, ఉచిత ప్రయాణం

ప్రభుత్వ పాలనలో సంస్కరణల్లో భాగంగా ఇకపై డిజిటల్ క్యాబినెట్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. వీబీజీ రాంజీ పథకంపై అధ్యయనం కోసం మంత్రులు సీతక్క, తుమ్మల, ఉత్తమ్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి జూన్ 25 లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది