Home Telangana కేసీఆర్‌–కేటీఆర్‌పై సీఎం సెటైర్లు

కేసీఆర్‌–కేటీఆర్‌పై సీఎం సెటైర్లు


అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెబుతా.
2034 వరకు మారొద్దంటున్న హితవు.

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్, కేటీఆర్ 2034 వరకు మారకూడదని, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇలాగే నిజాలు చెబుతూనే ఉంటా” అంటూ సెటైర్లు వేశారు. టిమ్స్ నిర్మాణంపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తమ కుటుంబం అధికారంలో ఉన్న సమయంలో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడానికి సమయం దొరికింది కానీ పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులు పూర్తి చేయడానికి సమయం దొరకలేదా? అంటూ నిలదీశారు.

పేదల వైద్యమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.2,700 కోట్లు, సీఎంఆర్‌ఎఫ్ కోసం రూ.2,526 కోట్లు ఖర్చు చేశామని, మొత్తం రూ.5,226 కోట్లు పేదల ఆరోగ్యం కోసం వెచ్చించామని వెల్లడించారు. రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖకు రూ.21,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తే 10 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 2027 డిసెంబర్ 9లోగా వాటిని పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఆసుపత్రులపై డెడ్‌లైన్.. విపక్షాలపై ఫైర్

ప్రతి ఆసుపత్రికి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించి పర్యవేక్షిస్తామని సీఎం తెలిపారు. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగుల అటెండెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తామని, అదనపు సమయం పనిచేసే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టిమ్స్‌ను తామే నిర్మించామని కేటీఆర్ చెప్పడంపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రిబ్బన్ కట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, నియోజకవర్గానికి రూ.10–20 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవ చేస్తే గత తప్పుల ప్రభావం కొంత తగ్గుతుందని వ్యాఖ్యానించారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను నమ్మించలేరని, పేదలకు వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ స్పష్టం చేశారు.

 

#RevanthReddy #KCR #KTR #TIMS #SanathNagar #TelanganaPolitics #TelanganaGovernment #GovernmentHospitals #TelanganaHealthcare #HealthcareReforms #BRS #Congress #KCRvsRevanth #KTRvsRevanth #TelanganaNews