Home Telangana గోదావరి పుష్కరాల్లో అలసత్వానికి చోటులేదు

గోదావరి పుష్కరాల్లో అలసత్వానికి చోటులేదు


సెప్టెంబర్‌లో పనులు.. ఆగస్టులో టెండర్లు
సమన్వయంతో పనిచేయాలన్న శ్రీధర్ బాబు

గోదావరి పుష్కరాలు–2027ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షత వహించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు తప్పనిసరిగా ప్రారంభం కావాలని, ఆగస్టు చివరి నాటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టైర్‌-1 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని, కీలక ప్రాంతాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేస్తూనే నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని హెచ్చరించారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయమే కీలకం

పుష్కరాల పనుల పురోగతిని రోజువారీగా తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా పుష్కరాలను నిర్వహించగలమన్నారు. భక్తుల రవాణాకు ప్రతి రహదారిని అనుసంధానించాలని, ఎక్కడైనా రోడ్డు కనెక్టివిటీ లోపిస్తే వెంటనే గుర్తించి స్థానిక నిధులతో పనులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు, పండితులను ఏర్పాట్లలో భాగస్వాములను చేయాలని సూచించారు. భక్తులకు సేవలందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలను ముందుగానే గుర్తించాలని చెప్పారు. సబ్‌ కమిటీ సభ్యుల సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

#GodavariPushkaralu2027 #GodavariPushkaralu #Telangana #SridharBabu #TelanganaGovernment #PushkaraluPreparations #GodavariRiver #PilgrimFacilities #PushkaraluWorks #TelanganaNews #TelanganaPolitics #GodavariPushkaraluArrangements