Home AP సర్ స్ట్రైక్స్… ఏపీ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు

సర్ స్ట్రైక్స్… ఏపీ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు


ప్రత్యేక సవరణలో సంచలనాలు నమోదు
ఎస్‌ఐఆర్‌లో భారీ గుర్తింపులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో ఓటర్ల జాబితాకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 15.2 లక్షల మంది మరణించిన ఓటర్లను గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. అలాగే శాశ్వతంగా ఇతర నియోజకవర్గాలకు మారిన 14.4 లక్షల మంది ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. మరో 7.3 లక్షల మంది రెండు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

44.8 లక్షల ఫారాలు పెండింగ్

మే 25, 2026 నాటికి రాష్ట్రంలో 4.16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 3.7 కోట్ల మందికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే ద్వారా సేకరించినట్లు వెల్లడించారు. అయితే ఇంకా 44.8 లక్షల మంది ఓటర్ల నుంచి ఫారాలు అందలేదని చెప్పారు. ఈ జాబితాలను జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, బూత్ లెవల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

గుర్తుతెలియని ఓటర్లు కూడా

మొత్తం ఓటర్లలో 7.7 లక్షల మంది అంటే సుమారు 1.8 శాతం మంది ఇంటింటి సర్వేలో గుర్తుతెలియలేదని అధికారులు తెలిపారు. మరోవైపు 44.8 లక్షల పెండింగ్ ఫారాల్లో 37 లక్షలకుపైగా మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, రెండు చోట్ల నమోదు అయిన వారేనని స్పష్టం చేశారు.

జూలై 31 నుంచి అభ్యంతరాలు

ఓటర్ల ముసాయిదా జాబితాపై పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలకు సంబంధించి ప్రజలు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఇప్పటికే 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. 8,327 ఫారాలను మాత్రం ఓటర్లు తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల శాఖ స్పష్టం చేసింది.

 

#APVoterList #SIR #SpecialIntensiveRevision #AndhraPradesh #ElectionCommission #VoterVerification #ElectoralRolls #DuplicateVoters #APPolitics #ElectionNews