బీసీ నేత ఎదుగుదలను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు -వైసిపి నేతల ధ్వజం
ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే అరెస్టుల పర్వం
చీరాల, జూన్ 19(నాదేశం) : బాపట్ల జిల్లా చీరాలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, బీసీ నేత కారుమూరి సునీల్ యాదవ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చీరాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా చీరాల వైసిపి బీసీ సెల్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈడీని అడ్డుపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయంటూ వైఎస్సార్సీపీ బీసీ సెల్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం మద్యం రవాణా కాంట్రాక్టుల పేరిట కల్పిత కథనాలతో బీసీ నేతను వేధించడం దారుణమన్నారు. తక్షణమే కారుమూరి సునీల్ యాదవ్‌పై మోపిన తప్పుడు కేసులను ఉపసంహరించుకుని, ఆయన్ను విడుదల చేయాలని చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో బీసీల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లావ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు











