Home Political_News మెట్రోను అడ్డుకోవాల్సిన ఖర్మ మాకు లేదు

మెట్రోను అడ్డుకోవాల్సిన ఖర్మ మాకు లేదు

34

రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు

తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఖర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్సలు పట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అర్థంలేని ఆరోపణలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ దేశభక్తికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సర్టిఫికెట్ అంతకన్నా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎస్ఐఆర్ పేరుతో మతాల మధ్య చిచ్చు
కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ఎస్ఐఆర్ పేరుతో సమాజంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర మంత్రి తీవ్రంగా ఆరోపించారు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజలంతా తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ముస్లింలను బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల అక్రమ చొరబాటుదారులతో కాంగ్రెస్ పోలుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్ల సర్వే విషయంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.

దొంగ ఓట్లపై కాంగ్రెస్ డ్రామాలు
ఒకపక్క స్థానిక ముస్లింల ఓట్లను తొలగిస్తూ, ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ తరహాలో అక్రమ వలసదారులతో రాజకీయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బంగ్లాదేశ్ వాళ్లకు ఇక్కడ ఓటు హక్కు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఇతర దేశాల వారి దొంగ ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. ప్రతీ భారతీయ పౌరుడి ఓటు హక్కును కాపాడే బాధ్యత తమ పార్టీదేనని స్పష్టం చేశారు.

మోదీ నాయకత్వంలో ప్రగతి పరుగులు
ప్రపంచ దేశాలు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో అతలాకుతలమవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం మాత్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని బండి సంజయ్ కొనియాడారు. ఒకవైపు రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలతో దేశ మౌలిక వసతుల రూపురేఖలు మారుస్తున్నారని చెప్పారు. మరోవైపు ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, ఉచిత వైద్యం అందిస్తూ మోదీ పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. దేశంలో ప్రస్తుతం అభివృద్ధిలో నవశకం, సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తోందని ప్రశంసించారు.

తుపాకీ గొట్టంతో ఏమీ సాధించలేరు
దేశంలో మావోయిస్టుల హింసాత్మక విధానాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తుపాకీ గొట్టం వల్ల అభం శుభం తెలియని మైనర్లు, ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస ద్వారా ఏమీ సాధించలేమని మావోయిస్టు అగ్రనేతలు సైతం గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ లొంగిపోతున్నారని చెప్పారు. మావోయిస్టులు ఇక లేరని, ఆ భావజాలంతో ఉన్నవారు తక్షణమే తమ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు.