సామాన్యుడికి మరింత చేరువ
రూ.28,840 కోట్లతో కొత్త ప్రణాళిక
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే ధనికులకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఇప్పుడు ఈ విజయాన్ని మరింత విస్తరించేందుకు రూ.28,840 కోట్ల వ్యయంతో ‘నవీకరించిన ఉడాన్’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలోని చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యాలను మరింత విస్తరించనున్నారు.
100 విమానాశ్రయాలు.. 200 హెలిప్యాడ్‌లు
ఈ పథకంలో భాగంగా రూ.12,159 కోట్లతో కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు. కొండ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో అత్యవసర సేవలను వేగవంతం చేసేందుకు రూ.3,661 కోట్లతో 200 ఆధునిక హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. ఇప్పటికే ఉడాన్ కింద 95 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అభివృద్ధి కాగా, 679 మార్గాల్లో 1.68 కోట్ల మందికి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
ప్రయాణికులకు.. విమాన సంస్థలకు లాభం
చిన్న పట్టణాల మార్గాల్లో విమాన సర్వీసులు కొనసాగించేందుకు ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.10,043 కోట్లు కేటాయించింది. నిర్వహణ వ్యయాల కోసం మరో రూ.2,577 కోట్ల మద్దతు ఇవ్వనుంది. స్వదేశీ హెచ్ఏఎల్ డోర్నియర్ విమానాలు, ధృవ్ హెలికాప్టర్ల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి బలం చేకూర్చుతోంది. ఉడాన్ యాత్రి కేఫ్‌లు, ఉచిత వైఫై, ఫ్లైబ్రరీ వంటి సదుపాయాలతో విమాన ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ పథకం ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునివ్వనుంది.
#UDANScheme #UDAN2 #RegionalConnectivity #IndianAviation #CivilAviation #Airports #Helipads #AirTravel #Infrastructure #ModiGovernment #GovernmentSchemes #AviationGrowth #IndiaDevelopment #BreakingNews #IndiaNews











