గ్రామాభివృద్ధే లక్ష్యం: సత్తిబాబు
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదాం
గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రానున్న పంచాయతీ ఎన్నికల్లో మోరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా సత్తిబాబు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ ముఖద్వారం వద్ద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, దీనికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, గ్రామ యువత, పెద్దలు మరోసారి కలిసి వెళ్లి విజ్ఞాపన చేస్తే త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. గ్రామంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సత్తిబాబు పిలుపునిచ్చారు. అమ్మవారి ఆలయం సమీపంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన వీఆర్వో కార్యాలయం నిర్మాణం పూర్తి చేయించడం, ప్రధాన రహదారి వెంట డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వంటి సమస్యలను ఇప్పటికే ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేకు వివరించామని చెప్పారు. నియోజకవర్గంలో భారీ అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, గ్రామానికి రావాల్సిన పనులను సాధించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి సహకారం అందించాలని, తనకు ఆశీర్వాదం అందించాలని కోరారు.











