Home AP డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు

డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు

పీ4తో పేదల జీవితాల్లో మార్పు.
పేదరిక నిర్మూలనపై నారా లోకేశ్.

“పేదరిక నిర్మూలనకు డబ్బు మాత్రమే సరిపోదు. సరైన మార్గదర్శకత్వంతోనే నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. పీ4 పథకం ద్వారా దీన్ని నిరూపించాం” అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర @2047: ద న్యూ గ్రోత్ లెబరేటరీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమారు 200 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, టెక్నాలజీ రంగాల విస్తరణతో పెంచాలని వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రభుత్వ సంస్కృతిగా మార్చామని, పెట్టుబడి ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

క్లస్టర్లతో పరిశ్రమలకు ఊపు

రాష్ట్రంలో 23 ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. స్పేస్, డ్రోన్లు, స్టీల్, సిమెంట్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఏఐ, డేటా సెంటర్లు, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. విశాఖలో గూగుల్ ఏఐ ప్రాజెక్టును వేగంగా తీసుకువచ్చామని, ‘మనమిత్ర’ ద్వారా దాదాపు 1,000 పౌర సేవలు అందిస్తున్నామని వివరించారు. స్కైరూట్, సాగర్ డిఫెన్స్, ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ పెట్టుబడులతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ వ్యూహమన్నారు.

రూ.60 వేలతో యజమానిగా మహిళ

కుప్పంలో పీ4 ద్వారా చోటుచేసుకున్న మార్పును లోకేశ్ ఉదాహరణగా చెప్పారు. ఇటుక ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేసిన ఓ మహిళ రూ.60 వేల పెట్టుబడితో సొంత యూనిట్ ప్రారంభించి, ఏడాదిలో 20 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు. పేదరిక నిర్మూలనలో పీ4 కీలకంగా పనిచేస్తుందని, పాఠశాలల దత్తతతో విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, కుటుంబ బడ్జెట్, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు.

 

#NaraLokesh #P4Model #P4Scheme #PovertyEradication #AndhraPradesh #SwarnaAndhra2047 #PAFI #APDevelopment #APEconomy #IndustrialClusters #JobCreation #Investment #Kuppam #SpeedOfDoingBusiness #AndhraPradeshNews