ఎన్నికల కమిషన్ పేరుతో మోసం
ఓటర్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఫేక్ మెసేజ్‌లు పంపిస్తూ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదని, దరఖాస్తులో సమస్య ఉందని చెబుతూ ప్రజలను భయపెడుతున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
5 రూపాయలు- బ్యాంక్ వివరాలతో వల
దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని చెబుతూ రూ.5 చెల్లించాలని సైబర్ మోసగాళ్లు కోరుతున్నట్లు సీఈవో వెల్లడించారు. వాట్సాప్ ద్వారా లింక్ పంపించి దాని ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారని చెప్పారు. చిన్న మొత్తమే కదా అని స్పందిస్తే తర్వాత పెద్ద ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫేక్ మెసేజ్‌ల ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఏటీఎం లేదా ఇతర కీలక సమాచారం అడుగుతున్నారని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు.
మెసేజ్‌లు అధికారికం కావు
ఇలాంటి సందేశాలు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఎన్నికల కార్యాలయం నుంచి రావడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అధికారిక సంస్థల పేర్లు, లోగోలు ఉపయోగించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఓటర్లు ఏదైనా సందేహం ఉంటే అధికారిక ఎన్నికల కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించాలని సూచించారు. ఫేక్ కాల్స్, అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందించవద్దని సీఈవో సుదర్శన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. ఎవరైనా మోసపూరిత సందేశాలు పంపితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ముఖ్యంగా ఓటర్ వివరాల పేరుతో వచ్చే లింకులు, చెల్లింపుల డిమాండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఒక్క క్లిక్‌తో సమాచారం పోయే రోజుల్లో.. ఒక్క జాగ్రత్తే సైబర్ మోసాన్ని అడ్డుకునే కవచం.
#ECI #ElectionCommission #CyberFraud #FakeMessages #VoterScam #VoterDetails #CyberCrime #WhatsAppScam #OnlineFraud #VoterID #TelanganaCEO #TelanganaNews #ElectionNews #ScamAlert #CyberSecurity











