Home General మెగమలై భూములపై అన్నామలై నజర్

మెగమలై భూములపై అన్నామలై నజర్

రీ-సర్వేకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలి

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్–మెగమలై టైగర్ రిజర్వ్ పరిధిలో భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ‘వీ ది లీడర్స్’ వ్యవస్థాపకుడు కె. అన్నామలై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అటవీ, రెవెన్యూ, భూ సర్వే శాఖల అధికారులు, తేని జిల్లా యంత్రాంగం, సాంకేతిక నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి భూములను పునఃసర్వే చేయాలని సూచించారు. శాటిలైట్, డీజీపీఎస్‌ ఆధారిత సాంకేతిక పద్ధతులతో సర్వే నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీవిల్లిపుత్తూర్–మెగమలై టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న తేని జిల్లాలోని 14 పంచాయతీల్లో 1.5 లక్షల మందికి పైగా ప్రజలు తరతరాలుగా నివసిస్తున్నారని అన్నామలై తెలిపారు.

జీవనోపాధిపై ఆంక్షలతో ఇబ్బందులు

అటవీ పరిరక్షణ చర్యల కారణంగా స్థానిక ప్రజల జీవనోపాధి దెబ్బతింటోందని అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం, తోటల పనులు, పశుపోషణపై ఆధారపడుతున్న కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పట్టా భూములు కలిగిన రైతులు తమ సొంత పొలాల్లో సాగు చేసుకోవడంలో ఆంక్షలు ఎదుర్కొంటున్నారని, పంటలు, కూరగాయలను మార్కెట్లకు తరలించే సమయంలో చెక్‌పోస్టుల వద్ద సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో వేలాది కుటుంబాల రోజువారీ ఆదాయంపై ప్రభావం పడుతోందని వివరించారు. తరతరాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఆక్రమణలకు పాల్పడిన వారితో సమానంగా చూడటం సరికాదని స్పష్టం చేశారు.

అటవీ రక్షణతో ప్రజల భద్రత

అటవీ ప్రాంతాలను, పులుల సంరక్షణ కేంద్రాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో.. అక్కడ తరతరాలుగా జీవిస్తున్న ప్రజల జీవనోపాధిని రక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నామలై పేర్కొన్నారు. 2026 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆక్రమణలను తొలగించాల్సి ఉన్నప్పటికీ, ప్రభావిత ప్రజలకు పునరావాసం కల్పించాలని సూచించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజల జీవనాధారాలను దెబ్బతీసే చర్యలకు బదులుగా ప్రత్యామ్నాయ గృహాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. మెగమలై సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు.

 

#Meghamalai #KAnnamalai #Annamalai #MeghamalaiLandIssue #TamilNadu #Theni #TigerReserve #SrivilliputhurMeghamalai #LandDispute #ReSurvey #ForestLand #TamilNaduPolitics #FarmersIssue #LandSurvey