Home National_news Gen Z కోసం రాహుల్ కొత్త లుక్ టీషర్ట్‌లతో ఆకట్టుకునే వ్యూహం

Gen Z కోసం రాహుల్ కొత్త లుక్ టీషర్ట్‌లతో ఆకట్టుకునే వ్యూహం

యువతే టార్గెట్‌గా కొత్త స్టైల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారంలో తన లుక్‌ను కూడా వ్యూహాత్మకంగా మార్చుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది. గతంలో తెల్లటి టీషర్ట్‌లతో కనిపించిన రాహుల్.. ఇప్పుడు వివిధ రంగుల టీషర్ట్‌లు, షర్ట్‌లతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2022లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగిన భారత్‌ జోడో యాత్రలో తెల్లటి టీషర్ట్‌తో ఆయన కనిపించారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలు, రాజకీయ పర్యటనల్లో టీషర్ట్‌ ఆయన సాధారణ వస్త్రధారణగా మారింది. ఇప్పుడు అదే స్టైల్‌కు రంగులు జోడించి Gen Z యువతకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘ఛాత్రోం కీ గూంజ్‌’తో కొత్త సందేశం

పేపర్‌ లీక్‌ సమస్యలు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా ‘ఛాత్రోం కీ గూంజ్‌’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కోటాలో జరిగిన తొలి కార్యక్రమంలో నీలం రంగు టీషర్ట్‌తో కనిపించిన ఆయన.. అలహాబాద్‌లో విద్యార్థులతో సమావేశంలో పింక్‌ షర్ట్‌ ధరించారు. పుణెలో జరిగిన కార్యక్రమంలో పసుపు రంగు షర్ట్‌తో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థినులు, ఉద్యోగినులతో మహిళల భద్రత, స్వేచ్ఛ, హక్కులపై మాట్లాడారు. డెహ్రాడూన్‌లో టీషర్ట్‌కు బదులుగా షర్ట్‌ ధరించారు. దుస్తుల ఎంపికపై సోషల్‌ మీడియాలో చర్చ సాగుతున్నా.. అసలు లక్ష్యం యువతతో ప్రత్యక్ష అనుసంధానమేనని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

బీజేపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్‌ కన్ను

రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ లుక్‌ను బీజేపీ నేతలు గతంలో పలుమార్లు విమర్శించారు. రాజకీయంగా ఆయనను సీరియస్‌గా తీసుకోరాదనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే రాహుల్‌ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా తన శైలిలోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు Gen Z యువత, మహిళా ఓటర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ కొత్త రాజకీయ కమ్యూనికేషన్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యువత, మహిళలు ఎన్నికల్లో కీలక వర్గాలుగా మారుతున్న నేపథ్యంలో బీజేపీకి ఉన్న రాజకీయ బలాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ కూడా వారిపై దృష్టి పెంచుతోంది. అయితే సంప్రదాయ రాజకీయ ప్రచారానికి భిన్నంగా యువత సమస్యలు, సోషల్‌ మీడియా భాష, వ్యక్తిగత శైలి ద్వారా వారిని ఆకట్టుకోవడం కాంగ్రెస్‌ ఎంచుకున్న కొత్త మార్గంగా కనిపిస్తోంది.

#RahulGandhi #GenZ #RahulGandhiNewLook #Congress #YouthPolitics #GenZVoters #RahulGandhiTShirt #ChhatronKiGoonj #YouthOutreach #CongressStrategy #IndianPolitics #RahulGandhiCampaign #YouthVote #PoliticalStrategy