Home Naadesam_Special మైనార్టీ రిజర్వేషన్లపై రేవంత్ ఫైర్ నాలుగు శాతం రిజర్వేషన్లపై సవాల్

మైనార్టీ రిజర్వేషన్లపై రేవంత్ ఫైర్ నాలుగు శాతం రిజర్వేషన్లపై సవాల్


రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌దేనన్న సీఎం.

ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మైనారిటీస్‌ ఎక్స్‌లెన్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. మైనారిటీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసం కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారని విమర్శించారు. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో రిజర్వేషన్లను అమలు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ అని, హిందూ, ముస్లింలను రెండు కళ్లలా చూస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. మైనారిటీల సంక్షేమానికి సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరోపించారు. దేశంలో లౌకిక వర్గాల కోసం కాంగ్రెస్‌ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

నిఖత్‌, సిరాజ్‌కు ఉద్యోగాలు

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌-1 పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోయిందని సీఎం విమర్శించారు. టీజీపీఎస్సీలో అనుభవం లేని వ్యక్తులను నియమించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యావంతులను నియమించిందన్నారు. గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను కోర్టు పోరాటాల తర్వాత భర్తీ చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల ప్రోత్సాహకం అందించామని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

యువతకు నైపుణ్యాలపై ఫోకస్‌

మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంచుకోవాలని సీఎం సూచించారు. జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో బలోపేతం చేశామని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో కొందరు ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను లక్ష్యంగా చేసుకుంటున్నామని కొందరు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గల్లీగల్లీ తిరిగి, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఓటును పరిశీలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఓటు హక్కును కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు.

 

#RevanthReddy #MinorityReservations #MuslimReservation #FourPercentReservation #TelanganaPolitics #Congress #MinorityWelfare #NikhatZareen #MohammedSiraj #TGPSC #Group1Jobs #SIR #VoterList #TelanganaNews #TelanganaGovernment