చిన్నపిల్లలకు కథ చెప్పినట్లు అనగనగా ఒక రాజు… అంటూ మొదలుపెట్టారు రచయిత్రి షర్మిల ‘తరాలు నడిచిన దారులు’ కథని . రాజు అంటే ఇక్కడ రాజ్యానికి కాదు. రాజు అంటే రైతు, కూలీ, మాస్టార్, వ్యాపారస్తుడు… ఇలా ఎవరైనా కావచ్చు. ఎవడి కథకు వాడే రాజు. ఈ కథలో రచయిత్రి తాతే రాజు. కృష్ణా జిల్లాలోని ఓ కుగ్రామం నుంచి మొదలయ్యే వాస్తవాలకు ప్రతిరూపం ఈ కథ. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కృష్ణా జిల్లాలోని ఓ కుటుంబం చుట్టూ అల్లుకున్న కుటుంబ బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు, రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కుటుంబ సంబంధాలు, గ్రామస్తుల అనుబంధాలు, మానవ సంబంధాలు, గ్రామీణ జీవనం …. వంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో భాష నాకు బాగా నచ్చింది. కృష్ణా జిల్లాలో గ్రామీణ వాతావరణంలో మాట్లాడే చక్కటి భాష ఇందులో కనిపిస్తుంది. రచయిత్రి సందర్భానుసారం మంచి మంచి పదాలు వాడారు. రాశారు. తన కుటుంబ కథలో తనకు తెలియకుండానే రచయిత్రి తన కుటుంబ భాష రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవించిన ప్రతి ఒక్కరికి ఈ కథ కనెక్ట్ అవుతుంది.
రచయిత్రి గ్రామీణ రైతు జీవితాన్ని ఈ కథలో దించేశారు. బాల్య వివాహాలు, బాల్యంలోనే భర్తను కోల్పోయిన భార్య జీవితం, వివిధ రకాల పంటలు, రైతుల బాధలు, కాల ప్రవాహంలో కుటుంబాలలో, వ్యాపారాలలో వచ్చే వడిదుడుకులు … చాలా చక్కగా, ఇంతకంటే ఎవరూ వివరించలేరన్న రీతిలో రాశారు. రాశారు అనేకంటే, దృశ్యీకరించారు అనడం కరెక్ట్. ఇందులోని సంఘటనలు చదివే సమయంలో పాఠకులకు వారివారి జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా గ్రామాల్లో జీవించినవారికి, అలాగే సుదూర ప్రాంతాలు, విదేశాలలో స్థిరపడినవారికి అనేక సంఘటనలు కనెక్ట్ అవుతాయి. ఈ కథలో కుటుంబ బంధాలు హైలెట్. కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు, ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత…. వంటివి రచయిత్రి అనుభవించి మరీ రాశారు. అలాగే, ఇది వాస్తవ జీవిత చిత్రీకరణ అయినందున, సమాజంలో మనకు కనిపించే నెగెటివ్ క్యారెక్టర్స్, వారి అవలక్షణాలు, వికృత ప్రవర్తన, పైశాచికానందం …. వంటివి కూడా ఇందులో కనిపిస్తాయి. గ్రామాల్లో తగాదాలు, అప్పటి విచారణ, తీర్పులు, కాల క్రమంలో పెళ్లి ఊరేగింపులలో వచ్చిన మార్పులు…. చాలా చక్కగా వివరించారు.
చాలా సన్నివేశాలను రచయిత్రి కళ్లకు కట్టినట్లు, మనసుని కదిలించేవిధంగా ఓ దృశ్య కావ్యంగా రాశారు. ఈ కథలో హీరో కోనేరు వైకుంఠరావు అయినప్పటికీ, కథ మొత్తంలో విలువలకు కట్టుబడిన గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి శేషమ్మ. ఆ వ్యక్తి పాత్ర ఎంతో ఉదాత్తమైనది. ముతక చీరలు, కడ్డీ అంచు జరీ చీరలు, కళ్లే పూలు, కాస్తి చెక్క, నవనీతం, ఆలగోలు బాలగోలు, అస్తారుబతం, కొండేలు, అక్కడి… వంటి పదాలను వాడారు. కొన్ని పదాల అర్థాలు తెలుసుకోవడం కోసం నేను కూడా డిక్షనరీని ఆశ్రయించాను. ‘‘ఊరు ఉల్లిపాయంత, తగాదాలు తాటికాయంత’’ … వంటి సామెతలు కూడా చాలా వాడారు. చల్లపల్లి జమిందారుకు, బార్లపూడి గ్రామానికి ఉన్న లింకు, ఆ ఊర్లో అందరి ఇంటిపేర్లు ‘కోనేరు’ అని ఎందుకు ఉన్నాయో రచయిత్రి వివరించారు. పెద్ద కుటుంబం అయినందున, వారి పేర్లు, వారి మధ్య బంధాలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. ఇది కల్పిత కథకాదు, వాస్తవ జీవితాలు, అందువల్ల ఇటువంటివి తప్పదనిపించింది.
సమీక్షకులు : శిరందాసు నాగార్జున – 9440222914

114 పేజీల ‘తరాలు నడిచిన దారులు’ వెల: రూ.150
ప్రతులకు : 9010616598











