అప్పలరాజు అరెస్టుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడి అరెస్టులపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షసాధింపునకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా హత్య కేసు నమోదు చేసి, 18 ఏళ్ల యువకుడిని రిమాండ్‌కు పంపడం, అనంతరం మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అప్పలరాజును లక్ష్యంగా చేసుకున్నారని జగన్ అన్నారు. ఇదే చట్టం టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై కూడా సమానంగా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ప్రమాదాన్ని హత్యగా ఎలా పరిగణిస్తారని, కుమారుడి ఘటనకు తండ్రిని బాధ్యుడిని చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి ఎదిగి వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా సేవలందించిన అప్పలరాజును తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని జగన్ ఆరోపించారు. అక్రమ అరెస్టులతో వైసీపీని భయపెట్టలేరని, ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, అధికార దుర్వినియోగానికి ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.