ఓటర్లకు ఈసీ మరో అవకాశం.
సెప్టెంబర్ 10 వరకు ఛాన్స్.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కోసం గడువును సెప్టెంబర్ 10, 2026 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ విషయాన్ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు ఉండగా.. తాజాగా మరో 11 రోజులు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో పేరు లేకపోయిన అర్హులైన ఓటర్లు, తప్పుగా తొలగించినట్లు భావిస్తున్న వారు తమ వివరాలను తిరిగి నమోదు చేసుకునేందుకు అవకాశం లభించింది. అదే సమయంలో క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, వాటి పరిష్కార ప్రక్రియ గడువును అక్టోబర్ 5 వరకు ఈసీ పొడిగించింది. జూలై 1, 2026ను ప్రామాణిక తేదీగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 9, 2026న ప్రచురించనున్నట్లు ఈసీ తెలిపింది. దీంతో అర్హులైన ఓటర్లు గడువులోగా తమ పేర్లను పరిశీలించుకోవడం, అవసరమైతే క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేయడం కీలకంగా మారింది.
#AndhraPradesh #APVoterList #VoterListRevision #SIR #SIR2026 #ElectionCommission #APElectionCommission #VoterRegistration #VoterClaims #VoterObjections #ElectoralRoll #APPolitics #AndhraPradeshNews #VoterUpdate











